ఏపీలో కరోనా లెక్కల వాస్తవాలేంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి లెక్క పక్కాగా తెలుసుకున్నాం. రాష్ట్రంలో జలుబు, జ్వరం వచ్చిన వారి వివరాలు కూడా చిటెకలో తెలుసుకునేలా వ్యవస్థ పనిచేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రచారం కోరుకోని వ్యక్తి..ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ఇందుకు నిదర్శనమే దేశంలోనే అత్యల్ప కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదు కావడమేనని.. ఏపీ అమాత్యులు మీడియా ముందుకొస్తే మాట్లాడే మాటలు. కానీ వాస్తవాలు ఇందుకు విరుద్దంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకు నిదర్శనంగా విదేశాలనుంచి వచ్చిన వారి సంఖ్య విషయంలో ఎంత గందరగోళం నెలకొందో అందరికీ తెలుసు.

రాష్ట్రంలో కరోనా నిర్థారణ ల్యాబ్‌ల సామర్థ్యంపై ఆందోళనకర పరిస్తితులు ఉన్నాయి. తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురంలలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లలో మాత్రమే ఇప్పటి వరకూ కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. నాలుగు ల్యాబ్‌లలో 240కి మించి శాంపిల్స్‌ పరీక్షించే స్థాయి లేదు. రోజుకు రెండు షిఫ్ట్‌లలో శాంపిల్స్‌ పరీక్షించవచ్చు. ప్రతి షిఫ్ట్‌కు 30 చొప్పున రోజుకు ఒక్కో ల్యాబ్‌లో 60 శాంపిల్స్‌ మాత్రమే పరీక్ష చేసే సామర్థ్యం ఉంది. కాగా, విశాఖపట్నం, గుంటూరు, కడపల్లోనూ ల్యాబ్‌లు పెట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇవి కూడా అందుబాటులోకి వస్తే 420 శాంపిల్స్‌ పరీక్ష చేయగల సామర్థ్యం మాత్రమే రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఏ మేరకు సరిపోతుందో ఆరోగ్యశాఖ అధికారులు ఆలోచన చేయాలని ఆరోగ్య రంగ నిపుణులు అంటున్నారు. ఒకేసారి రెండు వేల మందికి పరీక్షలు చేయగల సామర్థ్యం లేకపోతే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొవడం కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటి వరకూ విదేశాల నుంచి 28 వేల మంది రాష్ట్రంలోకి వచ్చారని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. వీరిలో ఎంత మందికి కరోనా ప్రభావం ఉందో చెప్పలేని పరిస్థితి. ఉన్న వారిలో ఎంత మంది వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటున్నారో అంచనా వేయలేని పరిస్థితుల్లో ఆరోగ్యశాఖ అధికారులున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అయినా రాష్ట్రంలో ల్యాబ్‌ల సామర్థ్యం పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, 17 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిని కరోనా నిర్థారణ ల్యాబ్‌లుగా మా ర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వే యాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబ్‌లను కూడా కరోనా నిర్థారణ పరీక్షలకు ఉపయోగించాలని సూచనలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఒకేసారి 2 వేలకు పైగా శాం పిల్స్‌ను పరీక్ష చేయగలిగే సామర్థ్యం పెంచుకుంటే తప్ప ఏప్రిల్‌లో ఎదురయ్యే పరిస్థితిని తట్టుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేస్తున్నారు. 

నిపుణుల హెచ్చరికలు చూస్తే రాష్ట్రంలో తగినన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడం వల్లనే పాజిటివ్ కేసుల సంఖ్య తెలడంలేదన్న సంగతి తెలుస్తోంది. మరో వైపు సాక్షాత్తు ప్రజా ప్రతినిధి బంధువు వల్లనే గుంటూరులో కరోనా వచ్చింది. ఈ విషయం ఆలోచిస్తేనే ప్రజలు వణికి పోతున్నారు. కనీసం వ్యాధి సోకినా నిర్ధారణ అయ్యే పరిస్తితులు ఉన్నాయా? లేవా అని భయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పాలని వేడుకుంటున్నారు. కేవలం లాక్ డౌన్ ప్రకటిస్తే సరిపోదని, ప్రజారోగ్యం ప్రధమ ప్రాధామ్యంగా కరోనా నిర్ధారణ ల్యాబులను, కిట్లను సాద్యమైనంత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.