విదేశీయుల లెక్క తేల్చడంలో వైఫల్యం- ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలైన వెంటనే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల జాబితాను తీసుకునే విషయంలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం ఇప్పుడు కొంప మంచుతోంది. కేవలం కేంద్రం ఇచ్చిన డేటాపైనే ఆధారపడి ప్రయాణికులను క్వారంటైన్ కు పంపిన ఏపీ సర్కార్.. ఆ తర్వాత పెరుగుతున్న కేసులతో కలవరపడటం ప్రారంభించింది. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ప్రభుత్వం కళ్లు తెరిచే సరికే వందల సంఖ్యలో విదేశీ ప్రయాణికులు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేశారు. దీంతో ఇప్పుడు వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది.

ఈ నెల 22న జనతా కర్ఫ్యూ విధించిన నాడే అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపేసింది. కానీ ఇవాళ్టికీ విదేశీ ప్రయాణికుల సంఖ్యను రోజుకు వెయ్యి చొప్పున పెంచుకుంటూ ప్రభుత్వం గణాంకాలు విడుదల చేస్తోంది. అదేంటని అడిగితే కేంద్రం ఇచ్చిన లెక్కలు సమగ్రంగా లేవని, అందుకే తాము ప్రతి రోజూ వాలంటీర్ల సాయంతో విదేశీ ప్రయాణికులను లెక్కిస్తున్నట్లు చెబుతోంది. అయితే ఇప్పటికే పరిస్ధితి చేయి దాటిపోయినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ఏపీలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. ఇంకా ఇలాంటివారు ఎందరున్నారో తెలియదు. వీరి లెక్క తేలితేనే కానీ ఏపీలో కరోనా వైరస్ ఎప్పుడు నియంత్రణలోకి వస్తుందో తెలియని పరిస్దితి ఇప్పుడు నెలకొంది.