మళ్ళీ విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ

 

నిన్నజరిగిన సహకారసంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మరోమారు విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 2933 సంఘాలలోకాంగ్రెస్ 1233 గెలుచుకొని తన ప్రత్యర్దులయిన తెలుగు దేశం పార్టీ, తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను వెనక్కు నెట్టి, రాష్ట్రం మొత్తం మీద పట్టు సాదించింది. తెలుగు దేశం పార్టీ:730; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ:432;తెరాస:121; లెఫ్ట్:31; ఇతరులు:131 సంఘాలలో గెలిచారు. మొత్తం 161 సంఘాల ఫలితాలు వాయిదాపడగా, మరో 85 సంఘాల ఫలితాలు ‘హంగ్’ అని ప్రకటించారు.

 

పార్టీ రహితంగా జరుగవలసిన ఈ సహకార ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానే పోటీకి దిగడంతో, సాధారణ ఎన్నికలు తీసిపోని రీతిలోసాగాయి. ఈ ఎన్నికలలోపట్టు సాధించడం ద్వారా రాజకీయ పార్టీలు గ్రామ స్థాయిలో తమ పార్టీలను బలోపేతం చేసుకొనే అవకాశం ఉన్నందునే, అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ పడ్డాయి.

 

వచ్చే సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలో మిగిలిన పార్టీలన్నిటినీ తుడిచిపెట్టేస్తామని బింకాలు పలుకుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా అంశంపై, తెలంగాణా ప్రజలపై తమకే పూర్తీ హక్కులున్నయనట్లు మాట్లాడే తెరాస, రెండూ కూడా ఈఎన్నికలలో చతికిలబడ్డాయి. అయితే, ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక హెచ్చరిక వంటివే నని చెప్పవచ్చును. రాష్ట్రంలో అన్ని పార్టీలు కట్టకట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఎంత ప్రచారం చేసినా కూడా, చివరికి ఆయనదే పైచేయి అవడం వారందరికీ చెంప పెట్టువంటిదేనని చెప్పవచ్చును.

 

కిరణ్ కుమార్ రెడ్డిని చరిత్రలోనే అత్యంత అసమర్ధ ముఖ్యమంత్రి అని పేర్కొనే వారికి, ఈ ఎన్నికలోక చెంప దెబ్బవంటివి. ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెరాసలు చేరుకోలేకపోయాయి. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ కొంత మెరుగుయిన ఫలితాలను రాబట్టి, ఆ రెండు పార్తీలకన్నా ఎక్కువ సంఘాలను గెలుచుకొని రాష్ట్రంలో తన ప్రభావం తగ్గలేదని నిరూపించుకొంది.

 

ఈ ఎన్నికలలో స్థానిక పరిస్థితులు, స్థానిక నేతల మద్య నున్న సంబంధ బాంధవ్యాలు లెక్కలోకి తీసుకొంటే, వీటిని సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా చెప్పలేక పోయిన్నపటికీ, ఈ ఎన్నికల ప్రభావం రాజకీయ పార్టీలపై తప్పకుండా ఉంటుంది. మళ్ళీ అదికారంలోకి రావాలనుకొనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఫలితాలను హెచ్చరికగా తెసుకొని తగిన మార్పులు, ప్రణాలికలు చేసుకోకపొతే, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ధృడంగా ఎదిగి, రాష్ట్రంలో అన్నిరాజకీయ పార్టీలకు పెనుసవాలు విసురుతుందని చెప్పవచ్చును.