బుద్ధుందా? ఇదేనా సంస్కారం?

విజ‌య‌సాయిరెడ్డి. వైసీపీలో ఓవ‌రాక్ష‌న్ లీడ‌ర్‌గా పేరు. ట్విట్ట‌ర్‌లో చంద్ర‌బాబుపై, టీడీపీపై నిత్యం నోరు పారేసుకునే నాయ‌కుడు. అలాంటి విజ‌య‌సాయి.. పుట్టిన రోజు నాడు సైతం చంద్ర‌బాబును ఆడిపోసుకున్నాడు. 420 అంటూ.. ఏ2 విజ‌య‌సాయి నోటి కొచ్చిన‌ట్టు మాట్లాడాడు. సీఎం జ‌గ‌న్ సైతం హుందాగా ప్ర‌తిప‌క్ష నేత‌కు బ‌ర్త్‌డే విషెష్ చెబితే.. విజ‌య‌సాయిరెడ్డి మాత్రం చంద్ర‌బాబును పుట్టిన రోజున‌ అవ‌హేళ‌న చేసిన‌ట్టు మాట్లాడటాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు త‌ప్పుబ‌డుతున్నాయి. మ‌రీ, ఇంత మ్యానర్స్ లేకుండా ప్ర‌వ‌ర్తించాలా? అంటూ త‌ప్పుబ‌డుతున్నాయి.

తాజాగా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విజ‌య‌సాయిపై మండిపడ్డారు. ప్రత్యర్థిని కూడా గౌరవించాలని రామాయణం చెపుతోందని.. చిన్నప్పటి నుంచి అలాంటి గ్రంధాలు చదివి ఉంటే మంచి లక్షణాలు వచ్చుండేవని విజ‌య‌సాయిని ఏకి పారేశారు. పార్టీ జాతీయ కార్యదర్శివి, రాజ్యసభ సభ్యుడివి, పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలందరికీ నాయకుడివి.. ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. అసలు బుద్ధుందా? ఇదేనా సంస్కారం? అని మండిప‌డ్డారు రఘురామకృష్ణరాజు.

చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్, తాను కూడా చాలా సంస్కారంతో శుభాకాంక్షలను తెలియజేశామని.. మీరు చేసిన ట్వీట్ దారుణంగా ఉందని అన్నారు. ఇలాంటి సంకుచిత స్వభావాన్ని వీడండని విజ‌య‌సాయికి సూచించారు.

చెత్త మాటలు మాట్లాడితే మీకేదో గండపెండేరం తొడుగుతారని భావిస్తున్నారేమో.. మీరు ఇతరులను గౌరవిస్తేనే, సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందని రఘురాజు హితవు పలికారు. మీరు చేసే దిక్కుమాలిన ట్వీట్లను సోషల్ మీడియాలో తప్ప, సంస్కారం ఉన్న వాళ్లెవరూ ఇష్టపడరని అన్నారు. మీరు చేస్తున్న దిక్కుమాలిన, దగుల్భాజీ ట్వీట్ల వల్ల తటస్థంగా ఉన్న 15 శాతం ఓట్లు పార్టీకి దూరమవుతాయని చెప్పారు. మీ వికృత చేష్టల వల్ల.. మీరు ఎవరినైతే విమర్శిస్తున్నారో, వాళ్లకే ఆ ఓట్లు పోతాయని అన్నారు.

ఇప్పటికైనా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని విజయసాయికి రఘురాజు సూచించారు. మీరు మీ పంథాను ఇలాగే  కొనసాగిస్తే.. పార్టీ జాతీయ కార్యదర్శిగా మీ స్థానంలో మరొకరిని జగన్ నియమిస్తే బాగుంటుందని అన్నారు. విజయసాయిరెడ్డి స్థానంలో సంస్కారం ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి పెద్దలను నియమించడం బెటర్ అని స‌ల‌హా ఇచ్చారు రఘురామకృష్ణరాజు.

ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా వరుసగా ట్వీట్లు చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత 'పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని' ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ 'బ్రీఫ్ డు అవసరం లేదు అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

38 ఏళ్ల క్రితం ఏర్పడిన పార్టీ ఈరోజు జెండా పీకేసే దశలో ఉన్నా చంద్రబాబు తన జన్మదిన వేడుకలను ఉల్లాసంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. ‘పార్టీ లేదు బొక్కా లేదని’ అచ్చెన్న అన్నది యధార్థమే. ఈ ఒక్క రోజు అన్నీ మర్చిపోయి కుటుంబంతో హాయిగా గడపండి మరో మరో ట్వీట్ చేశారు విజయసాయి.