బొమ్మ బొరుసయ్యింది.. నారాయణఖేడ్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలు!!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుంది. అయితే కొన్ని చోట్ల అధికార పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇస్తోంది. నారాయణఖేడ్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 15 వార్డుల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్, 7 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీలు స్థానాలను గెలుచుకున్నాయి. 6వ వార్డులో కాంగ్రెస్ కు 7 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో టీఆర్ఎస్ రీకౌంటింగ్ కు డిమాండ్ చేసింది. 7వ వార్డు లో టిఆర్ఎస్ కు 2 ఓట్ల ఆధిక్యం రాగా కాంగ్రెస్ రీకౌంటింగ్ కోరింది. 

మొత్తం మీద కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి కట్టుగా పనిచేయటం హస్తం పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ లోని వర్గ విభేదాలు నారాయణఖేడ్ లో అధికార పార్టీకి షాక్ ఇచ్చాయి. స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అందుబాటులో ఉన్నప్పటికీ మిగిలిన నేతలందరూ కలిసి రాకపోవడంతో టీఆర్ఎస్ కు అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. నారాయణఖేడ్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మొత్తం మీద వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఎట్టకేలకు నారాయణఖేడ్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నట్లు సమాచారం.