తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

 

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.భైంసాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.ఆ కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ ఒక్కరోజు కూడా పరామర్శించలేదన్నారు.కానీ రాహుల్‌ దిల్లీ నుంచి వచ్చి 15 కి.మీల పాదయాత్ర చేసి రైతులకు సంఘీభావం తెలిపారన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.డిసెంబర్‌ 12న రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. ప్రత్యేక రాష్ట్రంతో తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు ఆశించినప్పటికీ.. తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు.తెలంగాణ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.

అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 'తెలుగువారిని రాష్ట్రపతి, ప్రధానిగా చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే' అన్నారు.కాంగ్రెస్‌ కుటుంబ పార్టీ కాదని, కాంగ్రెస్‌ చరిత్రను కేసీఆర్‌ తెలుసుకోవాలని సూచించారు. మాజీ ప్రధాని నెహ్రూ మరణం తర్వాతే ఇందిర మంత్రి అయ్యారని, దేశం కోసం రాజీవ్‌ గాంధీ ప్రాణాలు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం కోసమే సోనియా పార్టీ పగ్గాలు తీసుకున్నారని, మన్మోహన్‌ లాంటి మేధావిని ఆమె ప్రధానిని చేశారని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం సోనియా కుటుంబం పదవులకు దూరంగా ఉందని, దేశ ప్రజలంతా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల బతుకులు మారాలంటే కేసీఆర్‌ను ఓడించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.