కాంగ్రెస్ రెబెల్ ఎంపీలపై బహిష్కరణ వేటు

 

కాంగ్రెస్ అధిష్టానం తన ఆరుగురు సీమాంధ్ర యంపీలు-లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, హర్షకుమార్, సాయి ప్రతాప్ మరియు సబ్బంహరి పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకి పాల్పడినందుకు పార్టీ నుండి వెంటనే బహిష్కరింస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి జనార్ధన్ ద్వివేది కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి ఇదివరకే కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి కూడా రాజీనామా చేసినపుడు, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ వారిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదం. త్వరలో లోక్ సభ, లేదా రాజ్య సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టినపుడు వారెలాగూ బిల్లుకి అనుకూలంగా ఓటు వేస్తారనే నమ్మకం లేదు. అటువంటప్పుడు వారిపై బహిష్కరణ వేటు వేయడం ద్వారా ఓటింగ్ సమయంలో సభ నుండి సస్పెండ్ చేసి బయటకి పంపేయవచ్చును. కాంగ్రెస్ పార్టీ తన యంపీలను కూడా అదుపు చేయకుండా వారినడ్డుపెట్టుకొని సభ జరగకుండా నాటకాలు ఆడుతోందని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో ఎట్టకేలకు వారిపై చర్యలు తీసుకోక తప్పలేదు. కానీ, తన నిర్ణయాన్ని నిరసిస్తూ, వ్యతిరేఖిస్తూ డిల్లీలో తన కళ్ళెదుటే దీక్షలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ,ఆయన బార్య బొత్స ఝాన్సీ, కేంద్రమంత్రులు కావూరి, చిరంజీవి తదితరులపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోనవసరం లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పడం విశేషం.

 

 ఈ బహిష్కరణ ద్వారా వారికి కీడు కంటే మేలే ఎక్కువ జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో ముగిసిపోయే యూపీఏలో వారు కొనసాగకపోయినా వారికి వచ్చే నష్టమేమీ ఉండబోదు. కానీ, ఈ బహిష్కరణ ద్వారా సీమాంధ్ర ప్రజల నుండి వారికి బోలెడంత సానుభూతి ఆయాచితంగా దొరుకుతుంది. ఒకవేళ ఇది కూడా కాంగ్రెస్ విభజన వ్యూహంలో భాగమే అయితే పార్లమెంటు సమావేశాలు ముగియగానే, రాష్ట్ర విభజన బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేసిన మరికొంత మంది యంపీలను, కేంద్ర మంత్రులను కూడా పార్టీ నుండి బహిష్కరించినా ఆశ్చర్యం లేదు. వీరందరూ కలిసి కిరణ్ కుమార్ రెడ్డి లేదా మరొకరు పెట్టబోయే కొత్త గొడుగు క్రింద చేరి ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకోవచ్చును.