ఈ అవినీతి పాలనకు అంతం ఎప్పుడు?

 

 

congress sonia gandi,  sonia gandi rahul gandi, congress scams,  sonia gandi congress

 

 

ఈనాటి దేశ, ఆంధ్ర రాష్ట్రాల రాజకీయాల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ముందు రాష్ట్రం గురించి ప్రస్తావిస్తే .... రాష్ట్రంలో కాంగ్రెస్ ముందు రెండు పెను సవాళ్లు ఉన్నాయి. ఒకటి తెలంగాణ సమస్య, రెండవది వైకాపా. ఇక అవినీతి భాగోతం ఎటూ ఉండనే ఉంది. ఇప్పటికే జగన్ అవినీతి నేపథ్యంలో ఇద్దరు మంత్రులు పదవిని కోల్పోగా ఇప్పటికే పదవి కోల్పోయిన మంత్రి మోపిదేవి వెంకట రమణ .... ఇదే వరుసలో మరి కొందరు.... అయినా సరే 2014 ఎన్నికలలో కిరణ్ చాకచక్యంతో, బొత్స మంత్రాంగం తో పార్టీ నెగ్గుకు వచ్చేస్తుందని వారి ప్రగల్భాలు.


మరి తెలంగాణ విషయానికి వస్తే అదో రగులుతున్న కుంపటి. ఎన్నికల వేళ ప్రతి వారికి అదొక అస్త్రం. దాన్ని తేల్చని వారు ఒకరు... అది తేలడం ఇష్టం లేని వారు ఒకరు .... దాని పేరు చెప్పి ఉద్యమం మాటున పార్టీని బలోపేతం చేసుకునే ధన అహంకారి మరొకరు. ఇదిలా ఉంటే ఈ రోజు ముగ్గురు టి- కాంగ్రెస్ ఎంపీలు వివేక్, మంద జగన్నాధం, రాజయ్యలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రఘునందన్ గత కొద్ది రోజులగా తెరాస అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరుగుతూ ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తున్న సమయం లో కాంగ్రెస్ నుండి తెరాస లోకి ఇలాంటి వలసల వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రజలందరికీ విదితమే. ఈ 4 సం.రాలు గా మన రాష్ట్రం సాధించిన దానికన్నా కోల్పోయినదే ఎక్కువ.



 కేంద్రంలో మరో పరిస్థితి. రైల్వే మంత్రిని, న్యాయ శాఖా మంత్రిని పదవుల నుండి తొలగించడం వెనుక సోనియా గాంధీ దురుద్దేశం ఉన్నట్లు సమాచారం. కారణం ... మన్మోహన్ సింగ్ తన రాష్ట్రానికి చెందిన బన్సాల్, అశ్విని కుమార్, కపిల్ సిబాల్... ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత వరుసతో ఆయన తన అనుకూల వర్గాన్ని తయారు చేసుకున్నాడని, అంతే కాక పలు రాజకీయ కీలక అంశాలలో ఆయన సతీమణి గుర్శరన్ కౌర్ కీలక పాత్ర వహిస్తున్నారని సోనియా గాంధీ కినుక వహించింది. అందులో భాగంగానే పంజాబ్ కు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులను అధికారం నుండి తప్పించింది.

           

అయితే రాష్ట్రానికి, కేంద్రానికి సంబందించి ఒక విషయం లో పోలిక ఉంది. ఇక్కడ రాజశేఖర రెడ్డికి అనుయాయులుగా ఉన్న మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పదవులు కోల్పోతున్నారు. పైగా తప్పును సమర్ధించటం, సహకరించటం కూడా తప్పే కదా అంటూ వారిపై అభియోగాలు మోపారు. అటువంటి తరుణం లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2జీ స్పెక్ట్రం కుంభకోణం మొదలుకుని నిన్నటి సీబీఐ నివేదిక నిర్వాకం వరకు జరిగిన అన్ని అంశాలకు ప్రధాని నైతిక బాధ్యత వహించరా? అన్ని కుంభకోణాల మరకలు తమ ప్రభుత్వం పై పడుతుంటే కూడా ఆయన మౌనమే వహిస్తారా? మరి కుంభకోణాలను సమర్ధించడం కూడా తప్పే కదా. రాష్ట్రంలో ఒక న్యాయం .... కేంద్రంలో ఒక న్యాయమా? సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా గురించి కూడా ఏమీ మాట్లాడరు. అంటే ఇక్కడ ధర్మాన, సబితల లాగానే అక్కడ మన్మోహన్ కి కూడా అధికారం లేకపోయినా పదవి ఉంటే చాలా? అధికారం ఎంత దుర్వినియోగం అవుతున్నా పర్వాలేదా?
            

అసలు ఏమిటీ రాజకీయ కాంక్ష, పదవీకాంక్ష? ఏ మాత్రం రాజకీయ సామర్థ్యం, పరిపాలనచేవా లేని తన కొడుకు రాహుల్ గాంధీ కోసం అతని రాజకీయ భవిష్యత్తు కోసం 120 కోట్ల భారత ప్రజానీకం భవిష్యత్తును కాలరాయాలని చూస్తున్న సోనియా గాంధీని ఏమనాలి? 2014 ఎన్నికల నాటికి తన కొడుకు రాహుల్ చుట్టూ అంత ఆయన అనుయాయులే ఉండాలనే ఆమె తాపత్రయానికి మళ్ళీ త్యాగం అనే పేరెందుకు? సోనియా గాంధీ ఈ తాపత్రయం కారణంగా ప్రధాని త్వరలోనే తన పదవిని కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి అంటిన కుంభకోణాల మరకల విషయంలో మన్మోహన్ సింగ్ తో పాటు సోనియా గాంధీ నైతిక బాధ్యత వహించదా? అలా బాధ్యత వహిస్తే రాహుల్ ను ప్రజలు ఎలా ఆదరించాలి?

                  

సోనియా గాంధీకి యావత్ రాజకీయ నాయకులందరూ ఎందుకు భయపడుతున్నారు? 10 సం.రాల క్రితం సోనియా గాంధీ ప్రధాని అవ్వడానికి వీల్లేదని అడ్డుపడిన భాజపా ఆమె అల్లుడు అవినీతి కేసుల విషయంలో సీబీఐ విచారణకు భాజపా కాని ఇతర పార్టీలు కానీ ఎందుకు పట్టుపట్టడం లేదు?ఒకనాడు రాజశేఖర రెడ్డి నియంతలా వ్యవహరించిన ఫలితం సదరు కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా అవినీతి ముద్ర వేయించుకుంటూ ఉంటే, సోనియా గాంధీ నియంత ధాటికి కాంగ్రెస్ పునాదులే కదిలిపోతున్నాయి. తద్వారా దేశ పురోగతి చిన్నాభిన్నమైపోతొంది.

                

ఏది ఏమైనా అంతరిక్షం వైపు పరుగులు పెడుతున్న ఈ ఆధునిక యుగంలో భారత దేశం లో సోనియా గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నది నియంత పరిపాలన. మళ్ళీ దానికి ప్రజాస్వామ్యమనే పేరెందుకు? కేవలం ఓట్లు అడుక్కోవడానికి తప్ప. కాబట్టి సగటు భారతీయుడా! మేలుకో! నీలో చేవ ఉంటే ... చైతన్యం ఉంటే ... నీజాతిని జాగృతం చెయ్యి. అది నీ బాధ్యత... నీ కర్తవ్యం.