తెలంగాణలో అరాచక పాలన

 

తెలంగాణాలో ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి.ముఖ్యంగా తెరాస పార్టీ ప్రచారాల్లో ముందంజలో ఉంది.ఆ పార్టీ మంత్రులు  హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఎన్నికల ప్రచారాల్లో తెరాస పార్టీ ని గద్దె దింపాలనే కసితో ఉన్న మహాకూటిమి,తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు.అయితే చంద్రబాబుపై మీరా విమర్శలు చేసేది అంటూ కేటీఆర్‌, హరీశ్‌రావులపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి. జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెరాస నేతలపై విమర్శలు చేశారు.తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని,చంద్రబాబును విమర్శించే ముందు తెలంగాణలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండు చేశారు. తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించేందుకే మహాకూటమి ఆవిర్భవించిందని అన్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, తెజస అధ్యక్షుడు కోదండరాం, గద్దర్‌లతో పాటు వామపక్షాలు, విమలక్క లాంటి వారు అంతా ఒక్కటవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. వీరంతా కలిసి కేసీఆర్‌ను గద్దె దించటం ఖాయమని జోస్యం చెప్పారు.