చంద్రబాబును కలవనున్న కాంగ్రెస్ సీనియర్ నేత

 

ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత దేశంలోని ప్రాంతీయ పార్టీలతోపాటు మొత్తం అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.అందులో భాగంగా ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలను కలిసిన చంద్రబాబు...కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు.అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు.గతాన్ని మరచి కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.రాహుల్ గాంధీతో భేటీ అవ్వటం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.రాహుల్ తో భేటీ అనంతరం చంద్రబాబు తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు.కర్ణాటక వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.అంతేకాకుండా చెన్నైవెళ్లి డీఎంకే అధక్షుడు స్టాలిన్‌ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్డీయేకు వ్యతిరేకంగా జరుగుతున్న కూటమిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలను, ఆయా పార్టీల అధ్యక్షులను, కీలక నేతలను ఆయన కలుస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రయత్నాల్లో వేగం పెంచింది. రాహుల్ తరుపున చంద్రబాబుతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అమరావతి వస్తున్నారు భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం.