అమాయకుల సంఖ్య!

 

 

 

సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో అమాయకులు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా అనే ప్రశ్నకు నిన్నటి వరకూ ఎవరూ సమాధానం చెప్పలేకపోయేవారు. కానీ ఈరోజు మాత్రం ఈ ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పొచ్చు. అమాయకత్వం పర్సెంటేజ్ ఎంతమందిలో ఎక్కువ వుంది.. ఎంతమందిలో తక్కువ వుందనే విషయాన్ని కూడా క్లియర్‌గా చెప్పేయొచ్చు. టోటల్‌గా సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో మొత్తం అమాయకుల సంఖ్య ఎంతంటే, 1335. అవును.. అక్షరాలా పదమూడు వందల ముప్పయి ఐదు. ఈ సంఖ్య నీకెలా తెలుసని ప్రశ్నిస్తే దానికీ సమాధానం వుంది.

 

ఈ సంఖ్యని సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డే స్వయంగా ప్రకటించాడు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌తో ఎన్నికలలో పోటీ చేయడానికి మొత్తం 1335 మంది దరఖాస్తు చేసుకున్నారని రఘువీరా ప్రకటించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ నేలమట్టమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కావాలని కోరుకునేవాళ్ళు అమాయకులే కదా మరి!



ఈ అమాయకులలో ఓ మోస్తరు అమాయకుల సంఖ్య 1160. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటున్నారు. మరీ ముదిరిపోయిన అమాయకుల సంఖ్య 175. ఎందుకంటే వీళ్ళు పార్లమెంట్‌కి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ అమాయకులను కాంగ్రెస్ పార్టీ ఎలాగూ కాపాడలేదు.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నవాళ్ళు అవుతారు.