కేంద్రం కాకి లెక్కలు!

 

 

 

కేంద్రం తన రాయల తెలంగాణ ప్రతిపాదనని ఎప్పుడెప్పుడు బయటపెట్టాలా అని ఉవ్విళ్లూరుతున్నట్టుంది. కాకిలెక్కలకు ఎంతమాత్రం తీసిపోని అంచనాలతో రాయల తెలంగాణ ఇవ్వాలని ఫిక్సయిపోయినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తేనెతుట్టెని కదల్చగానే కేంద్రాన్ని అనేకానేక సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని సమస్యలు ప్రథమ చికిత్స చేస్తే తగ్గిపోయే రోగాల్లాంటివి కాగా, మరికొన్ని సమస్యలు ఎప్పటికీ వదలక పీడించే దీర్ఘకాలిక రోగాల్లాంటివి. ఈ రోగాలన్నిటినీ నివారించే సర్వరోగ నివారణి ‘రాయల తెలంగాణ’ అని కేంద్రం భావిస్తోంది.

 

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేయడం వల్ల  కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వుండే అద్భుతమైన ఫలితాలేవో వచ్చేస్తాయని కేంద్రం కలలు కంటోంది. కొత్త రాష్ట్రంలో తాను అధికారంలోకి రావడానికి, ఎక్కువ ఎంపీ సీట్లు గెలవటానికి, టీఆర్ఎస్, బీజేపీలను కొత్త రాష్ట్రంలో కంట్రోల్ చేయడానికి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేసుకోవడానికి, జలవివాదాలు తలెత్తకుండా వుండటానికి, సీమాంధ్రకు రాజధాని సమస్య రాకుండా వుండటానికి... ఇలా ఒకటీ రెండు కాదు రెండు మూడు డజన్లకు పైగా అంశాలను కేంద్రం ఆలోచించి పెట్టేసుకుంది.



తెలంగాణను ప్రకటించి తాను తప్పు చేశానన్న అపరాధభావం కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అంతర్లీనంగా వుంది. తనకు ఎంతమాత్రం ఉపయోగపడేలా లేని లేనిపోని తద్దినాన్ని అనవసరంగా నెత్తికెత్తుకున్నానని మథనపడుతోంది. తెలంగాణ ఇచ్చేసిన నింద పడేది కాంగ్రెస్ పార్టీమీదే అయినా రాజకీయ లబ్ధి మాత్రం టీఆర్ఎస్‌కి వెళ్లేలా పరిస్థితులు తయారయ్యాయని బాధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకోవడానికి కూడా రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అడుసు తొక్కిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి రాయల తెలంగాణని ఉపయోగించుకోవాలని భావిస్తోంది.