తల్లి కాంగ్రెస్ పార్టీలాగే పిల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ


 



ఏపీ శీతాకల సమావేశాలు.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మించిపోయాయి. అప్పుడు సభను సజావుగా సాగనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా ఆందోళనలు చేశారో ఇప్పుడు పిల్ల పార్టీ వైఎస్సార్ పార్టీ కూడా అలాగే చేస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. సభ అలా ప్రారంభమయ్యేదో లేదో ఇలా ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం దగ్గర ప్రత్యక్షమయ్యేవారు. ఆఖరికి వారి ఆందోళనలతో కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసే పరిస్థితి వరకూ తెచ్చుకున్నారు. ఇంతకు ముందు ఏ పార్టీ ఎంపీలు సస్పెండ్ కానట్టు..తమ పార్టీ నేతలే మొట్టమొదటి సారిగా సస్పెండ్ కు గురైనట్టు సోనియా గాంధీ తెగ నిరసనలు ధర్నాలు చేసేశారు.. అంతేకాదు.. ప్రజాస్వామ్యం చనిపోయింది అంటూ పెద్ద పెద్ద మాటలే వాడేశారు సోనియాగాంధీ. అయితే  ఇలా చేయడం వల్ల ఆపార్టీకి ఒరిగింది ఏదైనా ఉందా అంటే అదీ లేదు... పైగా అందరూ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇతర పార్టీ ఎంపీలను.. సొంత పార్టీ ఎంపీలను కూడా  నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి.. మీడియా ప్రసారాలు ఆపుచేసి మరీ రాష్ట్రాన్ని విభజించారు.. అప్పుడు గుర్తుకురాలేదా ప్రజాస్వామ్యం అంటూ దెప్పి పొడిచారు. ఒక రకంగా ఈసారి వర్షాకాల సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయాయి అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే..

ఇదిలా ఉండగా ఇప్పుడు పిల్ల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే మాటి మాటికి అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా సభలో గందరగోళాలు సృషిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై.. ప్రత్యేక ప్యాకేజీపై.. పట్టిసీమ ప్రాజెక్టుపై ఇలా ఎన్నో రకాల అంశాలపై అలా చర్చలు మొదలుపెట్టడం ఇలా వైసీపీ నేతలు ఆందోళనలు చేయడం. ఒకవైపు స్పీకర్ దయచేసి కూర్చోండి సభకు సహకరించాలని అంటూ ఎంత మొత్తుకున్నా ఏం లాభం వారి ధోరణి మాత్రం అంతే. మరోవైపు ఏపీ సీఎం కూడా వైసీపీ నేతల తీరుకు సహసం కోల్పోయి వారిమీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షాన్ని తాను ఇంత వరకు చూడలేదని.. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే సహించబోమని అన్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని, హుందాతనం అవసరమా, లేదా అని ఆయన మండిపడ్డారు. మొత్తానికి తల్లి పార్టీ.. పిల్ల పార్టీ అని అందరూ అనుకుంటున్నట్టుగానే ఈరెండు పార్టీలు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ వైఎస్సర్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒంటెద్దు పోకడని అనుసరిస్తున్నాయి.