కాంగ్రెస్ కపట నాటకాలకు అంతే లేదా?

 

నిన్న మొన్నటి వరకు తమను తమ అధిష్టానం అసలు ఖాతరు చేయడం లేదని, తమ మాటకు అసలు విలువే ఈయడం లేదని వాపోయిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ ఇప్పుడు అదే అధిష్టానానికి వీరభజనలు చేసేస్తూ, రాష్ట్రాన్ని విడదీసిందని తిట్టిపోసిన అదే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తీరుతామని శపధాలు కూడా చేస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చాలా కనికరం చూపుతూ అనేక వరాలు ప్రకటించినందున వారిరువురికీ సీమాంధ్ర ప్రజలు ఎంతో ఋణపడి ఉండాలని, అందువలన కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించుకొని కృతజ్ఞత ప్రకటించుకోవాలని కాంగ్రెస్ నేతలు కొందరు ఊరూరు తిరుగుతూ ప్రజలకు నూరిపోస్తున్నారు. పనిలోపనిగా, పార్టీని వీడిపోయిన వారందరూ ద్రోహులని, వారి వలననే రాష్ట్ర విభజన జరిగిందని అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ, ఒకసారి తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖల వలననే విభజించవలసి వచ్చిందని, అన్ని పార్టీలు ఒత్తిడి చేయడం వలననే విభజించవలసి వచ్చిందని మరోసారి, కిరణ్ కుమార్ రెడ్డి సహకరించడం వలననే విభజన జరిగిందని మరొకసారి చెప్పడం గమనిస్తే కాంగ్రెస్ నాలికకి నరం లేదని అర్ధమవుతుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన అధిష్టానానికి పూర్తిగా సహకరించారని చిరంజీవే స్వయంగా చెపుతున్నారు. అంటే ఆ విషయం ఆయనకీ చాలా స్పష్టంగా తెలుసనీ ఆయనే దృవీకరిస్తున్నారు.

 

అదేవిధంగా పార్టీకి అత్యంత విదేయుడయిన కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా విభజన ప్రక్రియను చివరి వరకు పర్యవేక్షిస్తారని దిగ్విజయ్ సింగ్ కూడా మొదటే ప్రకటించారు. ఆయన చెప్పినట్లే విభజన ప్రక్రియకి రాష్ట్రంలో ఎక్కడా ఆటంకం ఏర్పడకుండా టీ-బిల్లుని కిరణ్ కుమార్ రెడ్డి సజావుగా కేంద్రానికి త్రిప్పిపంపారు. అంటే కాంగ్రెస్ నేతలందరూ కలిసి కట్టుగా నాటకమాడుతూ ప్రజలను మభ్యపెడుతూనే ఈ తంతు పూర్తి చేసారని స్పష్టమవుతోంది.

 

కానీ, ఇప్పుడు చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డి తమను, పార్టీని మోసం చేసారని ఆరోపించడం చాలా విడ్డూరంగా కనిపిస్తున్నపటికీ, ఇదంతా కూడా కాంగ్రెస్ నేతలందరూ కలిసి కట్టుగా ఆడుతున్న నాటకంలో భాగమేనని, ఎన్నికల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడో లేక దానికి మద్దతు ఇచ్చినపుడో నిరూపించబడుతుంది.

 

అదేవిధంగా సీమాంధ్రలో ప్రతిపక్షాల మీద, పార్టీని వదిలిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి మీద నెపం వేసి చేతులు దులుపు కొంటున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణాలో మాత్రం సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణా ఏర్పడిందని అందువలన కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని కోరడం దీనిలో మరో కొత్త కోణం. అదేవిధంగా తెలంగాణా ఇచ్చినందుకు తెలంగాణాలో, సీమాంధ్రకు వరాలు ఇస్తున్నందుకు సీమాంద్రాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ఇరు ప్రాంతాల ప్రజలకు కాంగ్రెస్ నేతలు ప్రభోదిస్తున్నారు. కానీ, రాష్ట్ర విభజన చేసి అటు తెలంగాణా ప్రజలకు కానీ, ఇటు సీమాంద్రా ప్రజలకు గానీ సంతోషం కలిగించలేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో వారే చెప్పవలసి ఉంది.

 

సువిశాలమయిన భారతదేశాన్ని చిరకాలంగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ దృక్పధం కనబరచకపోగా, ఒక ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా వ్యవహరించింది. వ్యవహరిస్తోంది. అటువంటప్పుడు దానికి ఓటేసి, దాని ముందు చేతులు జాచే దుస్థితి తెచ్చుకొనే బదులు ప్రజాభిప్రాయానికి విలువనిస్తున్న ప్రాంతీయ పార్టీలకే ఓటు వేసి గెలిపించుకొన్నట్లయితే కనీసం ఉభయ రాష్ట్రాలలో పరిస్థితులు స్థానిక ప్రభుత్వాల నియంత్రణలో సాగే అవకాశం ఉంటుంది.