కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపమే రాజినామాలకు కారణమా?

 

తెలంగాణా అంశం తేల్చేందుకు మరింత సమయం పడుతుందని గులాం నబీ ఆజాద్ తేల్చేసిన తరువాత, ‘కాంగ్రెస్ మీదనే ఇక మా యుద్ధం, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో బొంద పెడతాము’ అంటూ ప్రకటించిన తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కేసీఆర్ ఇద్దరూ చేజేతులా తెలంగాణా కాంగ్రెస్ సభ్యులను దూరం చేసుకొన్నారు. ఆ తరువాత తెలంగాణా యం.పీ.లు రాజీనామాల అస్త్రంతో ముందుకు వెళ్ళినపటికీ, మళ్ళీ వారిలోఅభిప్రాయబేదాలు రావడంతో తెలంగాణా వేడి కొంత తగ్గింది.

 

బహుశః కాంగ్రెస్ అధిష్టానం వారికి తెలంగాణాపై తన ఆలోచనలను తెలియజేసి, తమకు దక్కవలసిన తెలంగాణా క్రెడిట్ ను, తమని, తమ పార్టీని, జాతీయ నాయకులను అవమానిస్తున్న తెరాసవంటి పార్టీలకు చేజేతులా అప్పగించడం రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే అవుతుందని వారికి నచ్చజెప్పడంవల్ల వారు వెనక్కి తగ్గి ఉండవచ్చును.

 

 

కానీ, వారు వెనక్కి తగ్గిన తరువాత ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ శాసనసభ్యులు రాజినామాలతో తెర మీదకి వచ్చారు. ఒక వైపు తెలంగాణా ఉద్యమాన్నిపక్కనపెట్టి, రాబోయే ఎన్నికలకి సిద్ధం అయిపోతున్న తెరాసను చూసిన తెలంగాణా కాంగ్రెస్ శాసన సభ్యులు, తమ రాజకీయ భవిష్యత్ గురించి తీవ్ర ఆందోళన చెందడం సహజమే. తెలంగాణా అంశంపై తాము ఎటువంటి పోరాటాలు చేయకుండా, పదవీ లాలసతో చేతులు ముడుచుకొని కూర్చోన్నమనే అభిప్రాయాన్ని, తెరాస ప్రజలో కలిగించి ఎన్నికలలో లబ్దిపొందుతుందని గ్రహించిన వారు, తాము సైతం తెలంగాణా కోసం అంటూ సోనియా గాంధీకి లేఖ, రాజీనామాలతో మీడియా ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే, వారిని కూడా కాంగ్రెస్ అధిష్టానం తన దారికి తెచ్చుకొంటుందని చెప్పవచ్చును.

 

ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస ఇప్పుడు పూర్తీ స్థాయి రాజకీయపార్టీగా ఎదగాలని ప్రణాలికలు రచిస్తుంటే, కాంగ్రెస్ ఊరకనే చూస్తూ కూర్చొంటుందని అనుకోలేము. రాబోయే ఎన్నికలలో తెలంగాణా అంశమే ప్రదానంగా చేసి లబ్ది పొందాలని చూస్తున్న తెరాసకు, సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణా పై కీలకమయిన ప్రకటనచేసి కాంగ్రెస్ పార్టీ ఆ సమస్యను అదిగమించవచ్చును. తద్వారా తెలంగాణా లో తన ఉనికిని కాపాడుకోవడమే కాకుండా, తెరాసను శాశ్వితంగా నోరు మూయించవచ్చునని కాంగ్రెస్ ఆలోచన చేస్తూండవచ్చును.

 

అయితే, ఈ విషయాన్నీ తన తెలంగాణా నేతలందరికీ చెప్పకపోవడంవల్లనే ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చెప్పటిన తరువాత కూడా ఆ పార్టీ ఇంకా తన మూస ధోరణిలోనే ఆలోచనలు చేస్తూ, రాష్ట్ర స్థాయి నేతలను, వారి ఆలోచనలను, భయాలను, సలహాలను స్వీకరించకుండా తానే స్వయంగా అన్నీ చక్కబెట్టేదామనే ఆలోచనతో సమావేశాలు నిర్వహించుకోవడం వల్ల, స్థానిక నాయకులలో తమ రాజకీయ భవిష్యత్ గురించి చాలా భయాందోళనలు నెలకొన్నాయి. వాటిని దూరం చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానందే.

 

వారిని కూడా పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగి ఉండిఉంటే చీటిమాటికి రాజీనామాలంటూ మీడియా ముందుకు వచ్చే తన నేతలను కూడా ఆపగలిగేది, తెలంగాణా సమస్యని ఇంకా సులువుగా పరిష్కరించగలిగేదేమో. తన చెప్పుచేతల్లో ఉన్న అటు సీమంధ్ర, ఇటు తెలంగాణా నేతలను ఒక్క తాటిపైకి తేగలిగితే, సమస్య పరిష్కారం అవ్వడమే కాకుండా, తనకి రాష్ట్రంలో పెను సవాలు విసురుతున్న తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలను ధీటుగా ఎదుర్కోగలిగేది.

 

గానీ, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రనేతలని తన పరిగణనలోకి తీసుకోకుండా ఒంటిగా ముందుకు పోతోంది. అది ఆ పార్టీకే నష్టం కలిగిస్తుంది అని తెలిసినా ఎందువల్లనో అదే ధోరణిలో ముందుకు సాగిపోతోంది.