కాంగ్రేసులో ‘పంచె’ తంత్రం

 

కాంగ్రెస్ అంటే ఒక మహా సముద్రం. కాంగ్రెస్ అంటే అనేక ముటాల సమూహం. కాంగ్రెస్ పార్టీకి అర్ధం ఎలా తిరుగ వ్రాసిన సమాధానం ఒకటే! సోనియా గాందీ+రాహుల్ గాంధీ=కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్=సోనియా గాందీ+రాహుల్ గాంధీ. ఇది తప్ప మరొక ఈక్వేషన్ ఉండదు ఆ పార్టీలో. అందువల్లే, కాంగ్రెస్ అంటే వారి వీరవిదేయుల ‘భజనమందిరం’ అని కూడా పేరుపడింది.


కాంగ్రెస్ పాలిత ఏరాష్ట్రం లోనయిన ముఖ్యమంత్రి నుండి స్తానిక నేతల వరకు ‘అమ్మ’ పేరుతోనే తమ ప్రసంగం మొదలు పెట్టి ‘రాహుల్ బాబు’ పేరు స్మరించుకొంటూ ముగించడం ఒక తప్పనిసరి ఆనవాయితీ క్రింద పాటిస్తుంటారు. ఒకవేళ ఏ కిరణ్ కుమార్ లాంటి వారో కొంచెం దైర్యం చేసుకొని ‘ఏవో కిరణాలంటూ’ తమ సంక్షేమకార్యక్రమానికి పొరపాటున తనపేరు తగిలించుకొన్నా, వెంటనే అమ్మపేరు లేదనుకొంటూ మరు నిమిషంలోనే డిల్లీకి ఫ్యాక్స్ మేసేజులు రవాణా అయిపోతాయి. ఆ దెబ్బకి యెంత గుండె నిబ్బరం ఉన్న మనిషయినా లెంపలేసుకోక తప్పదు. అంతగా వారిరువురి ప్రభావం పార్టీ మీదుంది.


అయితే, ఇప్పుడు ఈ సోదంతా (ఉపోద్ఘాతమంతా) ఎందుకంటె, కాంగ్రేసు పార్టీలో ఒక సామన్య కార్యకర్త కూడా కలలోకూడా ఉహించని, సాహసించని ఒక భయంకరమయిన దుర్వార్త ఒకటి ఇటీవల ఒక పత్రికలో వెలువడి కాంగ్రేసులో కలకలం రేపింది. డిల్లీ నుండి గల్లీ వరకు అందరు దాని గురించే చర్చోపచర్చలు చేస్తూ ‘ఔరా! ఎంత సాహసం ఉంటె ఇలాగ వ్రాయగలరూ?’ అని బుగ్గలు నొక్కుకొంటున్నారు.

 

అపార అనుభవజ్ఞుడు, గొప్ప ఆర్ధికవేత్తగా ప్రసిద్దుడు, మచ్చలేని ప్రధానిగా పేరొందిన డా.మన్మోహన్ సింగు గారు ఇంకా కుర్చీలోకూర్చొని ఉండగానే, ‘నేడో రేపో మిమ్మలిని దింపేసి ఆకుర్చీలో మా రాహుల్ బాబుని చూసుకోవాలనుకొంటున్నాము’ అని నిత్యం వినిపించే అవమానాలు భరిస్తు కూడా అయన ప్రశాంతంగా ‘కానున్నది కాక మానదు’ అనుకొంటూ ఒక నిర్వికార యోగి పుంగవుడిలా తనపని తానూ చేసుకు పోతూ, కనీసం 2014 వరకయిన తనని బలవంతంగా బయటకీడ్చేయలేనందుకు సంతోషపడుతూ, ఎన్నికల తరువాత రాహుల్ బాబుకి తనకుర్చీ అప్పగించచేసి పంజాబ్ వెళ్ళిపోవడానికి అయన మానసికంగా ఎప్పుడో సంసిద్దమయిపోయారు. కాంగ్రేసు మార్క్ రాజకీయలేప్పుడు అలానే ఉంటాయి.


ఇక ‘రాహుల్ బాబు నేడో రేపో ప్రధానిగా కుర్చీలోకూర్చొని దేశాన్ని ముందుకు తీసుకుపోవడమే ఇక ఆలశ్యం’ అని అందరూ అనుకొంటున్న ఈ తరుణంలో ఒక పత్రిక అది కూడా లండన్ నుండి వెలువడేది బాంబు లాంటి ఒక వార్త పేల్చింది. ‘రాహుల్ బాబు కన్నా ప్రధానమంత్రి పదవికి అనుభవజ్నుడయిన బూరె బుగ్గల ఆర్ధికమంత్రి చిదంబరమే సరయినవాడు. మిన్ను విరిగి మీద పడినా కూడా చలించక పంచె కట్టుతో ఎల్లప్పుడు చిర్నవ్వులు చిందించే చిడంబరమే మన్మోహన్ సింగు కి దీటయిన వ్యక్తీ అంతఅనుభవం ఉన్నవాడు కాంగ్రేసులో అతనొక్కడే’ అంటూ లండన్ నుండి వెలువడే ‘ద ఎకనామిస్ట్’ అనే ప్రముఖ పత్రిక ఇటీవలే ఒక కధనం ప్రచురించింది. అంతే, ఆ వార్త దావగ్నిలా కాంగ్రెస్ వర్గాలను కమ్మేసింది. ఖండన ముండనాలు యధావిధిగా జరిగిపోయాయి. గల్లీ నుండి డిల్లీ వరకు అందరు ఏకగ్రీవంగా ఆ వార్తని ఖండిస్తూ ఆ పత్రికా యాజమాన్యాన్ని, అదే నోటితో చిదంబరాన్నికూడా తప్పుపట్టేరు, కొండొకచో నిరసనలు కూడా చేపట్టే ఉండిఉండవచ్చు.


నాటి నుండి, ఆ కధనం రావడం వెనుక అతని పరోక్ష ‘హస్తం’ ఎమయినా ఉందా అని అందరూ చిదంబరం వైపు అనుమానంగా చూడటం మొదలు పెట్టారు. అతనినుండీ వివరణ తీసుకోవడమే గాకుండా, ‘రాబోయే ఎన్నికల తరువాత మా రాహుల్ బాబే ప్రధానపదవిని పుచ్చుకొంటాడు’ అని మీడియా వారిని పిలిచి మరీ మరోమారు స్పష్టం జేసారు కొందరు కాంగ్రేసు పెద్దలు. అప్పటికి గాని వారి ఆవేశం తగ్గ లేదు. కలలో కూడా ఉహించని ఇటువంటి వార్తలని అసలు ఆ పత్రిక వారు ఎందుకు ప్రచురించేరో, ఆ వెనుక ఎవరెవరి ‘హ్యాండ్స్’ ఉన్నాయో ఇంకా తెలుసుకోవలసి ఉంది. దానికోసం ఒక కమిటీ కూడా వేయాలని వీరవిదేయ సోనియావాదులు ఎవరయినా డిమాండ్ చేసారో లేదో ఇంకా తెలియదు.