మళ్ళీ ‘హ్యాండ్’ ఇచ్చిన ‘హస్తం’ పార్టీ

 

 

తే.రా.స., బిజే.పి.లు మొత్తుకొంటున్నట్లే అయింది చివరికి. కాంగ్రేసుని నమ్మడానికి వీలేదని, అది అఖిలపక్షం పేరుతొ మరో కొత్తనాటకం మొదలు పెట్టిందని బల్లగుద్ది మరీ చెప్పారు. పాపం! వారి మాటకి విలువ లేకుండా చేయడం ఎందుకని కాంగ్రేసు అనుకుందో ఏమో, మహోదయ మంత్రివర్యుల నోట మళ్ళీ ‘ఆ...జాదూ’ చిలకపలుకులే మళ్ళీ పలికించి, మరోరసవత్తరమయిన నాటకానికి తెర లేపింది కాంగ్రేసు పార్టీ. అయితే, ఈసారి ఆ నాటకానికి సుషీల్ కుమార్ షిండే అనే కొత్త దర్శకుడు వచ్చేడు.

 

ఇదివరకు జరిగిన సమైక్యాంద్రా, తెలంగాణా ఎపిసోడ్లన్నీ తానూ చూడలేదు గనుక, మళ్ళీ మొదటి నుండీ మొదలుపెట్టడమే మంచిదని భావిస్తున్నట్లు ఆ.. జాదూగారు ఈమద్యనే శలవిచ్చేరు. అందుకే, ఆయన అడుగు జాడలలో నడవడమే మేలనుకొన్నషిండేసారూ కూడా నిన్న మధ్యాహ్నమే తన మనసులో మాటని మీడియా కాకితో కబురంపించేరు..తమని లొంగ దీశామని వీరతాళ్ళు వేసుకు తిరుగుతున్న తెలంగాణా కాంగ్రేసు యమ్పీలకి!

 

అయన జెప్పిన దానిని బట్టి అర్ధమయిన దేమిటంటే “నేనేమి అఖిల పక్షం పెట్టాలని అనుకోలేదు. పాపం 19 మంది ఎంపీలు వచ్చి అడిగితె వాళ్ళని కాదని బాధ పెట్టడం ఎందుకనే ఒప్పుకొన్నాను. అయినా, ఇదేమి ఒక్క రోజుతో తేలిపోయే విషయమూ కాదు, ఇది మొదట మీటింగో ఆఖరి మీటింగో అంతకంటే కాదు. తెలంగాణా సమస్య కోసం ఇటువంటి మీటింగులు ‘అనేకం’ పెట్టుకొని, నిరంతర చర్చలు జరుపుతూ దానికి ఒక సరయిన పరిష్కారం కనీపెట్టాలి. ఆ ప్రయత్నంలోనే వేసిన తొలి అడుగే ఇది. అది ఇక్కడితో ఆగిపోదు. పోకూడదు. సమస్య పరిష్కారం అయ్యేవరకు అలా సాగుతూ......నే ఉండాలి. అందుకే నేను రాష్ట్రంలో అన్నిపార్టీలకు లేఖలు వ్రాయబోతున్నాను. అందరిని నా ఈ మొట్టమొదటి ప్రదర్శనకి (ఈ అఖిలపక్ష సమవేశానికి) తప్పక హాజరు కావాలని కోరుతున్నాను. వీలయితే ఒక్కరు, తప్పదంటే యెంత మందయినా పరువలేదు గాని తప్పక ఈ మీటింగుకి హాజరు కావాలని వ్రాయబోతున్నాను. ఎవరు యెంత మందిని పంపించుకొంటారో మరి వాళ్ళిష్టం. తెలంగాణా మీద చర్చలు జరుగుతుండటమే ఇక్కడ ప్రధానం తప్ప ‘మరోటి’ కాదు. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పీ.సి.సి. అధ్యక్షులు కూడా నా మీటింగు తేధిని మార్చమని సూచించేరు. కానీ, నా మొదటి ‘షో’కే ఇలాగ అడ్డుతగిలితే కుదరదని ఖరాఖండిగా చెప్పేసెను. అయినా, అన్నిపార్టీలు వాళ్ళు కోరితే మరి ‘షో’ వాయిదా వేసుకోక తప్పుతుందా? అని శలవిచ్చేరు.

 

కాంగ్రేసు పార్టీ ‘హస్తం’ గుర్తునే కోరుండీ ఎందుకు ఎంచుకొందో ఇప్పుడు చూచాయగా అర్ధమవుతుండగా తెలంగాణా కాంగ్రేసు యంపీలు ‘కిం కర్తవ్యమ్?’ అని తమలో తాము  గోణుకొంటూ  మళ్ళీ కేశవరావు ఇంటి వైపు పరుగులు తీసారు.

 

(కాంగ్రేసు బుర్రలో ఏమాలోచనలు ఉండి ఉంటాయో మొన్న ‘కాంగ్రేసుకి అఖిలమే సకలమూ’ అనే శీర్షికన చర్చించడం జరిగింది. బహుశః, ఇప్పుడు అదే చేసి చూపించ బోతోందేమో ‘హస్తం’ గుర్తున్న మన కాంగ్రేసు పార్టీ.)