కాంగ్రెస్ తన గోతిలో తానే పడిందా?

 

అఖిలపక్ష సమావేశం పెట్టి చంద్రబాబును ఇరుకున బెట్టేమని చంకలు కొట్టుకొంటున్న కాంగ్రేసుకి నిన్న ఆయన ఆదిలాబాద్ జిల్లాలోచెప్పిన జవాబుతో కంగుతినే పరిస్తితి వచ్చింది. చంద్రబాబు ఏమన్నారంటే “నేను ఎప్పుడూ, ఇప్పుడూ కూడా తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడలేదు. అసలు, తెలంగాణాపై అఖిల పక్ష సమావేశం నిర్వహించమని నేనే స్వయంగా కాంగ్రేసుకి లేఖ వ్రాసాను. కానీ ఇంతకాలం తాత్సారంచేసి దానిని ఒక అస్త్రంగా చేసుకొని తమ తెలంగాణా యమ్పీలను లొంగదీసుకోవడమేగాకుండా, ఇప్పుడు వారేదో స్వయంగా ఆలోచించి అఖిలపక్ష నిర్ణయం తీసుకొన్నట్లు గొప్పగా చెప్పుకొంటున్నారు. మేము అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా పై మాపార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్తాము. అప్పుడు, తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది ఎవరో వాళనే నిర్నయించుకోమనండి చూద్దాము.”

 

ఇంకా అఖిల పక్షానికి రెండు వారాలు పైగా గడువుండగానే ఇలాగ చెప్పిన చంద్రబాబు, బంతిని కాంగ్రేసు కోర్టులోకి నేట్టేరు. అఖిలపక్ష సమావేశానికి, కాంగ్రేసు పార్టీ ఒక్కోపార్టీ నుండి ఎంతమందిని ఆహ్వానిస్తుందనేది, తెలంగాణా విషయంలో కాంగ్రేసు యొక్క చిత్తశుద్ధిని బయటపెట్టబోతోంది. ఒక వేళ, అది గనుక పార్టీకి ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది చొప్పున పంపించమని కోరినట్లయితే, తద్వారా తెలంగాణా విషయమై పార్టీలు బిన్నభి ప్రాయలు వ్యక్తం చేశాయని వంక చూపించి తెలంగాణాపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా కాలయాపనచేసే ఆలోచనలో ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతుంది.

 

అందువల్ల తప్పనిసరిగా, తెలంగాణా నేతలు కోరుతున్నట్లు ఒక్కో పార్టీ నుంచి ఒక్కొకరినే ఆహ్వానించవలసి ఉంటుంది. అప్పుడు, అన్నిపార్టీలు తెలంగాణా విషయమై తమతమ అభిప్రాయాలు ఖరాఖండీగా ప్రకటించవలసివస్తుంది. చంద్రబాబు దూకుడు చూస్తుంటే అఖిలపక్ష సమావేశంలోనే ‘జై తెలంగాణా!’ అనబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంతవరకూ, తే.దే.పా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ లపై నిందవేసి తెలివిగా తప్పించుకొంటున్న కాంగ్రేసుకి అప్పుడు ఆదారి మూసుకుపోవడమేగాక, వెంటనే తెలంగాణా విషయం పై ఏదో ఒక ప్రకటన చేయక తప్పని పరిస్తితి వస్తుంది. పైగా తెలంగాణా నేతలనుండి ఒత్తిడి కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది. అప్పుడు, కాంగ్రెస్ తెలంగాణా విషయంలో కాలపయనచేసే ప్రతిఒక్కరోజూ కూడా తెలంగాణాలో దాని ఉనికికి ప్రశ్నార్ధంగా మార్చబోతుంది. అసలుకే మోసం వచ్చే పరిస్తితులు చేజేతులా తెచ్చుకోవాలో లేక ఎదో ఒక సానుకూల ప్రకటన చేసేసి వెంటనే ఎన్నికలకి వెళ్లిపోవడమో చేయాల్సి ఉంటుంది కాంగ్రేసుకి. కాంగ్రేసుకి ఇది ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ లాగ తయారవుతుంది. ఇంకా చెప్పాలంటే తే.దే.పా.కోసం తవ్విన గోతిలో తనేపడేట్లు ఉందిప్పుడు కాంగ్రెస్ పరిస్తితి.