నా వల్ల కాదంటూ పారిపోయిన రాహుల్ గాంధీకే మళ్లీ కాంగ్రెస్ పగ్గాలా?

దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాని నిలుపుకోవడానికి కూడా సతమతమవుతోంది. దానికి ప్రధాన కారణం నాయకత్వ లేమి. నరేంద్ర మోడీ- అమిత్ షా ద్వయం బీజేపీకి వరుసగా రెండోసారి ఘన విజయాన్ని అందించి దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ ని అలా ముందుండి నడిపించే నాయకుడు లేక.. వరుసగా రెండోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది. అదికూడా కేవలం పదుల సంఖ్యలో సీట్లు తెచ్చుకుంటూ.. ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. దీంతో కాంగ్రెస్ ని ఆదుకునే నాయకుడు ఎవరు?, కాంగ్రెస్ కి మళ్లీ పూర్వవైభవం ఎప్పుడొస్తుందని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ బరిలోకి దిగింది. 2014 సమయంలో పప్పు అనే ముద్ర వేసుకున్న రాహుల్ గాంధీ.. రాను రాను ఆ ముద్ర పోగొట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే మోడీకి ధీటైన నాయకుడిగా మాత్రం ఎదగలేకపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ ఓటమితో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్.. గాంధీ కుటుంబంతో సంబంధం లేని బలమైన నేతని ఎంపిక చేయాలని సూచించారు. అసలే ఓటమి, దానికితోడు పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడంతో.. పార్టీ శ్రేణులు ఢీలాపడిపోయాయి. పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. అయినా రాహుల్ మాత్రం అధ్యక్ష పదవిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సోనియాగాంధీ పార్టీ బాధ్యతలను తాత్కాలికంగా తీసుకున్నారు. అయితే సోనియా గాంధీ తరువాత పార్టీని నడిపించేది ఎవరు? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్ని వేధిస్తున్న ప్రశ్న.

ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు ఇవ్వాలని కొందరు కోరుతున్నా.. ఆమెకున్న ఈ కొద్ది రాజకీయ అనుభవంతో.. ఓ జాతీయ పార్టీని ముందుండి నడిపించి మోడీ-షాలను ఢీ కొట్టగలరా? అంటే అనుమానమే. పోనీ గాంధీ కుటుంబంతో సంబంధం లేని.. ఎవరైనా సీనియర్ నేతకి ఇద్దామా అంటే వర్గపోరు మొదలయ్యే అవకాశముంది. పీసీసీ చీఫ్ పదవి కోసం రాష్ట్రాలలో జరిగే వర్గపోరుతోనే కాంగ్రెస్ అధిష్టానం వేగలేకపోతుంది. ఇక జాతీయస్థాయిలో వర్గపోరు మొదలైతే ఇంకేమైనా ఉందా? పార్టీ పూర్తిగా బలహీనపడే ప్రమాదముంది. అందుకే కాంగ్రెస్ శ్రేణులు గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్నాయి. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు తీసుకోవాలని నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే పార్టీ బలోపేతమవుతుందని, ఆయనకు పార్టీ నాయకత్వ బాధ్యతలను తిరిగి అప్పగించాలంటూ సోనియాగాంధీకి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ లాయలిస్టు ఫోరం సైతం లేఖ రాసింది. ఇలా పలు రాష్ట్రాలలోని నేతలూ డిమాండ్ చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ వీరి కోరిక మేరకు పార్టీ పగ్గాలు చేపడతారా?. ఒకవేళ చేపట్టినా.. ఒకసారి నావల్ల కాదంటూ పార్టీ పగ్గాలు వదిలేసిన రాహుల్ గాంధీపై.. సామాన్య కార్యకర్తలకు, ప్రజలకు అంత త్వరగా నమ్మకం కలిగే అవకాశంలేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మరి కాంగ్రెస్ భవిష్యత్తుకి భరోసానిచ్చే నాయకుడు రాహుల్ అవుతాడో లేక మరెవరైనా అవుతారో చూద్దాం.