టీజేఎస్ డౌన్ డౌన్..గాంధీభవన్ ఎదుట ఆందోళన

 

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కంకణం కట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే పార్టీల మధ్య ఈ మధ్యనే సీట్ల పరంగా చర్చలు కొలిక్కి వచ్చాయి.కానీ ఏ ఏ స్థానాలలో ఏ పార్టీ అభ్యర్థులు అనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.ఇంకా అభ్యర్థుల జాబితా ప్రకటించటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాజాగా గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు.మల్కాజ్‌గిరి టికెట్ టీజేఎస్‌కు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌‌కు ఇవ్వాలని కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.లోనికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను సిబ్బంది అడ్డుకున్నారు. మల్కాజ్‌గిరి టికెట్ శ్రీధర్‌కే ఇవ్వాలని, టీజేఎస్ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో నిరసనకారులతో మాట్లాడేందుకు వీ.హనుమంతరావు యత్నిస్తున్నారు.ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తమ అభ్యర్థుల జాబితాని ప్రకటించలేదు.అంతే కాకుండా ఇతర పార్టీలకు కేటాయించిన స్థానాలపై ఇంకా చర్చలు కూడా పూర్తికాలేదు.కానీ ఊహాగానాలే కార్యకర్తలను రెచ్చగొడుతున్నాయి.ఆందోళనలకు దిగేలా చేస్తున్నాయి.ఇప్పుడే ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో? కూటమిలో ఉన్న అధ్యక్షులు కూడా మాకు టీఆర్ఎస్ ను అధికారం నుంచి దూరం చేయటమే లక్ష్యమంటూ సీట్ల కోసం పట్టుబడుతున్నారు.నిన్నా మొన్నటి వరకు బలంగా ఉన్నా కూటమి బీటలు బారేటట్లుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.టీఆర్ఎస్ ని గెలుపుకు దూరం చేయటం ఏమోగానీ కూటమి పార్టీలు విడిపోయి దూరమైతే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది అని పలువురు చర్చించుకుంటున్నారు.