కేసిఆర్ పై సమరానికి 'టీ కాంగ్రెస్' సిద్దం

 

 

 

టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అమీతుమీకి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను వీలినం చేయమని ప్రకటించడంతో ఆయనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కెసిఆర్ విలీనం చేయనని తేల్చడంతో తెలంగాణ ప్రాంత ఎంపీలు ఇక ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఓట్లు చీలకుండా ఉండేందుకే తాము తెరాస విలీనం అడిగామని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెసు చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. పునర్ నిర్మాణం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు.


కేసీఆర్ ఎప్పుడూ అబద్దాలే చెబుతారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ఆరోపించారు. పార్లమెంట్‌లో పిట్టలదొర కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని, తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్రలేదని ఆయన అన్నారు. తెలంగాణపై చర్చ సందర్భంగా ఎంఐఎం పార్టీ బిల్లులో సవరణలు చేసిందని, కేసీఆర్ బిల్లులో ఒక్క సవరణ ఏమైనా ప్రతిపాదించారా అని ప్రశ్నించారు. ఉద్యమం చేసిన వారంతా ఒక్కటి కావాలనే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేయాలని కోరామన్నారు. అయితే కేసీఆర్ నైజం అందరినీ మోసం చేయడమే అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి సోనియా కాళ్లెందుకు మొక్కారని ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ప్రశ్నించారు.



కాంగ్రెస్ పార్టీ ఇతరులపై ఎప్పుడు ఆధారపడలేదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టీఆర్ఎస్ తో పోత్తుగాని, వీలినంపై కాంగ్రెస్ ఎప్పుడు ఆలోచనలు చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెసు చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేనని అన్నారు.