తెరాస పై కాంగ్రెస్ ఎదురుదాడి

తెలంగాణ ఎన్నికల ప్రచార సభలతో హోరెత్తుతోంది.తెరాస,కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధిచుకుంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, సీనియర్‌ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలి, భట్టి విక్రమార్క, డీకే అరుణ. అనంతరం ఎన్నికల ప్రచార శంఖారావం పూరించి గద్వాల్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

 

 

ఈ సందర్బంగా మాట్లాడిన పీసీసీ చీఫ్‌ ఉత్తమకుమార్ రెడ్డి కేసీఆర్‌ అబద్ధాలకోరని ధ్వజమెత్తారు.కేసీఆర్‌ దళితుడిని ముఖ్యమంత్రి చేశారా? దళితులకు మూడు ఎకరాలు ఇచ్చారా? ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు. ‘మీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు తలసాని, మహేందర్‌రెడ్డి, తుమ్మల తెలంగాణలో ఎక్కడ ఉద్యమం చేశారని పక్కన కూర్చోబెట్టుకున్నావు?’ అంటూ ధ్వజమెత్తారు.కాంగ్రెస్‌ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన అంతం కావాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి మద్దతు ఇచ్చి కేసీఆర్‌ కేంద్రంలోని నరేంద్ర మోదీకి జైకొట్టారన్నారు. దిల్లీలో మోదీని ఓడించాలంటే రాష్ట్రంలో కేసీఆర్‌ను ఇంటికి పంపాలన్నారు.

అనంతరం మాట్లాడిన కాంగ్రెస్‌ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ‘‘అన్నా కేసీఆర్‌.. మా ప్రజలను కొంచెం పట్టించుకోండి దొరా! సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే నాలుగున్నరేళ్లు ప్రగతిభవన్‌లో, ఫామ్‌హౌస్‌లో కూర్చున్నావు’’ అని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు.ఒసేయ్‌ రాములమ్మ సినిమాను తలపించేలా రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నడిచిందన్నారు.రాములమ్మ సినిమాలో రామిరెడ్డి ఉంటే ఇక్కడ కేసీఆర్‌ ఉన్నారని ఆరోపించారు. ‘‘ఉద్యమంలో చూసిన కేసీఆర్‌ వేరు.. ఇప్పటి కేసీఆర్‌ వేరు’’ అన్నారు.అర్థరాత్రి తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి బయటకు పంపించాడని, కారణం మాత్రం చెప్పలేదని విమర్శించారు.కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, కవితను ఉద్దేశించి ‘‘వారు చార్‌మినార్‌ కాదు.. చోర్‌ మినార్‌’’ అని ధ్వజమెత్తారు.