సందిగ్ధంలో కాంగ్రెస్ నేతలు

 

తెలంగాణపై నిర్ణయానికి మరికొంత సమయం అవసరమన్న గులాం నబీ ఆజాద్ ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కిపోయింది. ఇంతవరకు డిల్లీచుట్టూ తిరిగిన రాజకీయాలు మళ్ళీ స్వంత గూటికి చేరుకాగానే కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

 

సీమంద్రా కాంగ్రెస్ నేతల పరిస్థతి కొంత బాగున్నపటికీ, తెలంగాణా కాంగ్రెస్ నేతల పరిస్థితి మాత్రం చాల దారుణంగా ఉందిప్పుడు. తెలంగాణా ఉద్యమానికి పూర్తి పేటెంటు హక్కులు పొందినట్లు ప్రవర్తిస్తున్న తెరాస నేతలు, కాంగ్రెస్ నాయకులపై కూడా హక్కులు కలిగిఉన్నట్లు చాలా అవమానకర రీతిలో మాట్లాడుతూ, వెంటనే పదవులకు రాజీనామాలు చేయాలంటూ ఆజ్ఞాపిస్తున్నారు. ఇటువంటి విపరీత ధోరణి అంటురోగంలా సమైక్యాంధ్రకి కూడా పాకిందిపుడు.

 

 

అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, సమాజంలో హోదా, పదవులు ఇత్యాదులన్నీ పొందిన కాంగ్రెస్ నేతలు మాత్రం, తమను తమ పార్టీని ఘోరంగా అవమానిస్తూ, బెదిరిస్తున్న ఉద్యమనాయకులకు దీటుగా జవాబు చెప్పకపోగా, కొందరు ఆత్మగౌరవం మరిచి తమ రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని వారిచుట్టూనే తిరుతున్నారు. ఒకవైపు తమ పార్టీ అధిష్టానం నిజాయితీగా సమస్య పరిష్కారినికి చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని తెలిసిఉన్నపటికీ తమను, తమ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా అవమానిస్తూ, బెదిరింపులకి పాల్పడుతున్న ఉద్యమనాయకులను నిలదీయలేక బిత్తర చూపులు చూస్తున్నారు. అది తెలంగాణానా ఉద్యమమా లేక సమైక్యాంధ్ర ఉద్యమమా అన్నదానితో సంబంధం లేకుండా కాంగ్రెస్ వాదులందరూ ఒకే కుటుంబముగా వ్యహరించి, తమ పార్టీపై దాడిచేస్తున్నవారిని సమర్ధంగా ఎదుర్కోనవలసిన తరుణంలో తమలో తామే తిట్టుకొంటూ అందరి ముందూ చుకన అవుతున్నారు..

 

ఇటువంటి కీలక సమయంలో కాంగ్రెస్ వాదులు తమ పార్టీని రక్షించుకోలేకపోతే, దానివల్ల అంతిమంగా నష్టపోయేదివారే తప్ప వేరొకరు కారని గ్రహించాలి. ఉద్యమనాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారేబదులు తామే సమస్యకి పరిష్కారం చూపగలమనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయవలసిన తరుణం ఇది. ఎందుకంటే, ఉద్యమనాయకులు ఉద్యామాలు చేయగలరు, ప్రభుత్వం పై ఒత్తిడి తేగలరు తప్ప సమస్యని పరిష్కరించలేరు. ఆ పని చేయవలసింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ తప్ప ఉద్యమనాయకులు మాత్రం కారు.

 

అందువల్ల డోలాయమానంలో ఉన్న కాంగ్రెస్ వాదులందరూ తమను, తమకు అన్నం పెట్టి ఆదరించిన కాంగ్రెస్ పార్టీని ఉద్యమనాయకుల బారినుండి కాపాడుకోవలసిన బాద్యత తమ మీదే ఉందని గ్రహించాలి. తమను నిర్దేసించవలసింది తమ పార్టీ అధిష్టానం తప్ప ఉద్యమ నాయకులుకారని వారు గ్రహించి పార్టీని తద్వారా తమని తాము కాపాడుకోవాలిసిన తరుణం ఇది.