పొన్నాల పంతం.. కాంగ్రెస్ అధిష్టానానికి తానేంటో చూపించబోతున్నారు!!

 

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే సూత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఫాలో అవుతున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పొన్నాల లక్ష్మయ్య తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. అయితే వైఎస్ మరణం తర్వాత ఆయన రాజకీయ చరిత్ర అడ్డం తిరిగిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అలాగే పరిస్థితులు ఒకప్పుడు టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉండి ఎంతో మందికి తన చేతుల మీదుగా బీఫాంలు అందించిన పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా మాత్రమే నిలుస్తున్నారు అనే వాదనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జరిగిన 2014 ఎన్నికలతో పాటు రెండో సారి 2018 లో జరిగిన ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం పొన్నాల లక్ష్మయ్య సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తడం ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నిజానికి పొన్నాల లక్ష్మయ్య గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయ మెట్లెక్కారు. ఒకవేళ ఆయన ప్రభ అలాగే కొనసాగి ఉంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించేవారేమో. అయితే ఆయన యూటర్న్ తీసుకుని మళ్లీ జనగామ జిల్లా రాజకీయాల పై దృష్టి సారించినట్లుగా ఉందన్న వాదనలు ఉన్నాయి. ముక్కు సూటిగా మాట్లాడే స్వభావిగా పొన్నాలకు పేరుంది. అలాగే ఢిల్లీ రాజకీయాన్ని గల్లీకి తీసుకురావటం ఆయనకే సాధ్యం అయిందనే ప్రశంసలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య రాజకీయ భవితవ్యం ఏమిటనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభావం రాష్ట్రమంతటా రెపరెపలాడుతుండగా ఆయన మాత్రం కేసీఆర్ ప్రభుత్వ పాలనపై వ్యతిరేక నినాదాలతో ఏటికి ఎదురీదుతున్నారనే అభిప్రాయాలు ఆయన అనుచర వర్గాలలోనే వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జనగామ నియోజక వర్గం నుండి పొన్నాల లక్ష్మయ్య వరుసగా రెండో సారి ఓటమి పాలు కావడంతో ఆయన చుట్టూ ప్రతికూల వాతావరణం అలుముకుంది. 2014 ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ గా ఆయన అక్కడ పోటీ చేసి ఓడారు. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సందిగ్ధంలో పడి టీపీసీసీ అధ్యక్ష పదవి నుండి పొన్నాలని తప్పించింది. బీసీ నాయకత్వం కంటే రెడ్డి నాయకత్వం ముఖ్యమని భావించిందో ఏమో పొన్నాలకు ఉద్వాసన పలికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. అప్పట్నుంచే పొన్నాల నిరాశకు లోనైనట్లు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది. 

అయితే ఇటీవల పొన్నాల లక్ష్మయ్య వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. పార్టీలో తన పట్టు తగ్గుతుందని ఆయన అనుకున్నారో ఏమో ఇటీవల సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాను ఉన్నానని అటు జనాలకు ఇటు రాజకీయ వర్గాలకు తెలిసేలా కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తడం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో గుసగుసులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో కార్మికులు చేసిన సుదీర్ఘ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. అయితే ఆందోళనకు ఆయన ఇలా వచ్చి అలా వెళ్లరనే టాక్ వుంది. సకల జనుల సమ్మె తరువాత మళ్లీ అంత పెద్ద స్థాయిలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిల పక్ష నేతలు పాల్గొన్నప్పటికీ పొన్నాల మాత్రం చురుగ్గా వ్యవహరించలేదు. లక్ష్మయ్యకు ఆయన కోడలు వైశాలీల మధ్య రాజకీయ వైరం నెలకొందనే ప్రచారం ఉంది. అయితే పొన్నాల తన కోడలు రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాను నెమ్మదిగా రాజకీయాల నుండి తప్పుకుని తన రాజకీయ వారసురాలిగా తన కోడల్ని కొనసాగించాలని ఆయన ముందుండి ప్రయత్నాలు చేస్తున్నారని అవి ఏ మేరకు ఫలిస్తాయోనని కింది స్థాయి నాయకుల్లో చర్చసాగుతోంది. మొత్తం మీద జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాజకీయాల్లో తన ఉనికి చాటుకోడానికి పొన్నాల లక్ష్మయ్య తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇక మీదట ఇంట గెలిచిన తర్వాత రచ్చగెలవాలనే కోనలో ఆయన ముందుకు సాగుతున్నారని సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సారి జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం చేకూర్చి పార్టీ అధిష్టానానికి తానేంటో నిరూపించుకుంటానని పొన్నాల లక్ష్మయ్య శపథంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన పంతం ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.