మహాకూటమిని చూసి టీఆర్ఎస్‌కు భయం పట్టుకుంది

 

టీఆర్ఎస్‌ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఒకవైపు టీఆర్ఎస్‌, బీజేపీ లాంటి పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుంటే.. మహాకూటమి మాత్రం సీట్ల సర్దుబాటుపై చర్చల దగ్గరే ఆగిపోయింది. త్వరగా ఈ చర్చలు ముగించి కూటమిలోని పార్టీలు సంతృప్తిపడేలా సీట్లు కేటాయించి అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి స్పందించారు. మహాకూటమి సీట్లన్నీ ఉమ్మడిగా ఒకేసారి ప్రకటించాలని చూస్తున్నామని ఆయన తెలిపారు. మిత్రపక్ష పార్టీలు తమకు ఎన్ని సీట్లు కావాలో నివేదిక ఇచ్చాయన్నారు. దీపావళి రోజున కానీ, ఆ తరువాత కానీ సీట్ల ప్రకటన ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థి పేరును కూడా ప్రకటించలేదన్నారు. కూటమిలో సామాజిక ప్రాధాన్యత ఉండాలని అనుకుంటున్నామని, దాని ప్రకారమే మిత్రపక్షాలు కూడా సీట్లు అడగాలని కోరామన్నారు. అదే విధంగా టీఆర్ఎస్‌ పైనా మధుయాష్కి మండిపడ్డారు. మహాకూటమిని చూసి టీఆర్ఎస్‌కు భయం పట్టుకుందన్నారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.