కార్యకర్తల సమావేశంలో జానారెడ్డికి చేదు అనుభవం

 

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీ ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఎంవీఆర్‌ ఫంక్షన్‌ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో  జానారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆయనకు నిరసన సెగ తగిలింది.ఎస్టీలకే మిర్యాలగూడ సీటు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ జానారెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్‌పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి ఉన్నవారికి కాకుండా స్థానికేతరులైన జానారెడ్డి తనయుడు రఘువీర్‌,‌ ఇటీవల పార్టీలో చేరిన అమరేందర్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే ఉరుకునేది లేదని స్పష్టంచేశారు. తొలి నుంచీ కాంగ్రెస్‌లోనే పనిచేస్తున్న గిరిజన నేతలు స్కైలాబ్‌ నాయక్, శంకర్‌ నాయక్‌లకు టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. జానారెడ్డి ఎంత సముదాయించినా శాంతించలేదు. కార్యకర్తల తీరుపై జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన ప్రచార రథం ఫ్లెక్సీలు చించివేశారు. కార్యకర్తల నిరసనతో జానారెడ్డి సమావేశం నుంచి అర్థంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.