టీడీపీతో కాంగ్రెస్ పొత్తు.. రాష్ట్ర నేతలకు చెప్పారా?

 

భాజపాయేతర కూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన చంద్రబాబు ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం పట్ల ఆ పార్టీలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తును వ్యతిరేకిస్తూ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా, ఆ బాటలోనే మరో సీనియర్ నేత సి.రామచంద్రయ్య నడుస్తున్నారు. చంద్రబాబుతో పొత్తును వ్యతిరేకిస్తూ సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీతో పొత్తుపై రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చించలేదని ఆయన అన్నారు. 

చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై ఎంత చెప్పినా తక్కువే అని, ఈ పాపాలను తమెలా మోయాలని రామచంద్రయ్య ప్రశ్నించారు.ఉన్నపళంగా చంద్రబాబు పవిత్రుడని ఎలా చెప్పాలని నిలదీశారు.పొత్తుపై రాహుల్‌ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమన్నారు.పొత్తుతో రాజకీయంగా ఫలితం ఉంటుందో లేదో తెలియదని...కానీ తాము నైతికంగా పతనమయ్యామన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుతో పొత్తా అని ప్రశ్నించారు.