పాక్ కి సాయం ప్రకటించిన సౌదీ రాజుకి మోదీ హగ్!!

 

ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి స్వాగతం పలకడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. ఆదివారం పాకిస్థాన్‌ పర్యటన ముగించుకున్న అనంతరం సౌదీ యువరాజు రియాద్‌ వెళ్లి అక్కడి నుంచి భారత్‌కు వచ్చారు. పాక్‌ పర్యటన నుంచి మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నేరుగా భారత్‌ రావడంపై ఇక్కడి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన రియాద్‌ వెళ్లి అక్కడి నుంచి భారత్‌కు వచ్చారు. ప్రొటోకాల్‌ ప్రకారం సౌదీ యువరాజును ఆహ్వానించేందుకు ప్రభుత్వానికి చెందిన మంత్రులని లేదా అధికారులను మోదీ పంపించాల్సి ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. దీంతో మోదీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్ మోదీపై విమర్శలు గుప్పించింది. ‘పాకిస్థాన్‌కు భారీగా ఆర్థిక సాయం చేస్తామని సౌదీ యువరాజు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ప్రధాని మోదీ ఇలా చేశారు. అమరవీరులు, భారతీయ సైనికుల సేవలు, త్యాగం గురించి ఏమనుకుంటున్నారో ప్రధాని మోదీ దేశానికి చూపించారు’ అంటూ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. మరో ట్వీట్ చేస్తూ పాకిస్థాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ తో పాటు సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పుల్వామా దాడిని ఖండిస్తూ ప్రకటన చేయలేదని చెప్పింది. పైగా ఆయన ఉగ్రవాదంపై పాకిస్థాన్ పోరాటాన్ని ప్రశంసించారని కాంగ్రెస్ తెలిపింది. దీనివల్ల మసూద్ అజహర్ ను ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రయత్నాలకు విఘాతం ఏర్పడిందని కాంగ్రెస్ అంది.

ఈ విషయంపై కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాక్‌కు 20బిలియన్‌ డాలర్ల మేరకు సాయం చేస్తామని హామీ ఇచ్చి, పాక్‌ చేస్తున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని ప్రశంసించిన వ్యక్తికి స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టారు. ఇదేనా పుల్వామా అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకునే మార్గం?.. జేఈఎం చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చేందుకు సౌదీ అరేబియా మద్దతు కోరే ధైర్యం చేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు.