కాంగ్రెస్ లో అహంకార కి'రణం'

 

 

congress kiran kumar reddy, kiran kumar reddy dl ravindra reddy

 

 

వైద్య శాఖ మంత్రి డి.ఎల్. రవీంద్ర రెడ్డిని ముఖ్యమంత్రి అధిష్ట్టానం అనుమతితో మంత్రి పదవి నుండి తొలగించిన విషయం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిని పరిశీలిస్తే వివిధరకాలైన అంశాలు వెలుగు చూస్తాయి.


ఒకప్పుడు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డి.ఎల్ రవీంద్ర రెడ్డి అత్యంత సన్నిహితులు. వై.యస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇద్దరికీ మంత్రి పదవులు దక్కకపోవటం ఈ సాన్నిహిత్యానికి ఒక కారణం అని చాలామంది ఉద్దేశ్యం. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తన మంత్రివర్గంలో అత్యంత ప్రాధాన్యమున్న వైద్య, ఆరోగ్య శాఖను డీ.ఎల్. కు పూర్తి స్థాయిలో అప్పగించారు. ఇది పలువురి మంత్రుల అలకలకు కూడా కారణమయ్యింది.

            

కడప లోక్ సభ ఉప ఎన్నికల వరకు ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఆ ఎన్నికల సమయంలోనే వివిధ అంశాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అక్కడి నుండే ఇద్దరు ఎడ ముఖం, పెడ ముఖంగా ఉంటూ, ఇద్దరు ఒకరితో ఒకరు విభేదాలు మరింతగా పెంచుకున్నారు.

           

డి. ఎల్. రవీంద్ర రెడ్డి రాజకీయ ప్రస్తానం 1978లో మొదలైన నాటి నుండి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, నేడురుమేల్లి ప్రభుత్వాలలో వివిధ కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలుత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ చేరారు. ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి 8 సార్లు పోటీ చేసి, 6 సార్లు గెలుపొందటం జరింగింది. అంతగా డి.ఎల్. రవీంద్ర రెడ్డి తన నియోజక వర్గం నుండి ప్రజాదరణ పొందిన రాజకీయ వేత్త.

                

అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన సామర్థ్యం ప్రజాదరణ కలిగిన ఒక సంపూర్ణ రాజకీయ నాయకుడిగా డి.ఎల్. అనేకసార్లు సి.ఎం. యొక్క పరిపాలనా తీరును విమర్శించారు. తనకు కేటాయించిన వైద్య శాఖ నిధులు సరిగా లేవని అనేకసార్లు మొరపెట్టుకుంటే, కావలిసిన నిధులు కేటాయించకపోగా శాఖను కుదించి, కొండ్రు మురళికి కేటాయించటం జరింగింది. ఇది ఒక సీనియర్ నేత పట్ల కిరణ్ కుమార్ రెడ్డి నడుచుకున్న విధానానికి అద్దం పడుతుంది.

                  

ఒకనాడు వైయస్ జగన్ ను ఎదురుకోవడానికి ఉపయోగించుకొని, ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఎందుకూ పనికి రాని వాడిగా చిత్రీకరించటం వెనుక కిరణ్ ఉద్దేశ్యం ఏమిటి? ఒక నాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తో విభేదించారు. తన వ్యక్తిగత విభేదాలను రాజకీయ విభేదాలుగా చూపించటం వలన పార్టీకి నష్టం జరుగుతున్న విషయాన్ని అధిష్టానం కూడా గమనించక పోవడం ఆశ్చర్యకరం.
 
             

ఇప్పటివరకు మొత్తం విషయాన్ని గమనిస్తే ప్రజాదరణతో ఎదిగిన నేత డి.ఎల్. ప్రజాదరణతో కాకుండా అధిష్ఠానం ఆశీస్సులతో ముఖ్య మంత్రి అయ్యి, అహంకార ప్రవర్తనను ప్రదర్శిస్తున్న నేత కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజల మధ్య నుండి వచ్చిన నాయకులు ప్రజాసంక్షేమం కోసం అవసరమైతే ప్రభుత్వ పరిపాలన తీరును ఎండ కడతారనడానికి డి.ఎల్. ఒక ఉదాహరణ అయితే, నడమంత్రపు అధికారం తో దురహంకారిగా ప్రవర్తిస్తూ ఏమాత్రం సామర్థ్యం లేని పరిపాలనకు పాలన కర్తగా కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఉదాహరణ.

              

ఈ మొత్తం వైనంలో అధిష్టానం వైఖరి చాలా అసమర్థతగా కనిపిస్తుంది. ముఖ్య మంత్రి అభ్యర్ధిగా అన్ని అర్హతలూ కలిగి ఉండి ఏనాడో ముఖ్య మంత్రి కావాల్సిన డి.ఎల్. రవీంద్ర రెడ్డి నేడు వివిధ స్వార్థ రాజకీయాలకు, దురహంకారానికి గుర్తుగా బర్తరఫ్ కాబడ్డారు. వివిధ రకాల లాబీయింగులకు, భజనపరులకు తలవోగ్గే దిక్కుమాలిన కాంగ్రెస్ అధిష్ఠానం, పనికిమాలిన అసమర్థ రాజకీయ నాయకులకు పట్టం కట్టడం కారణంగానే భారత దేశం ఆర్ధిక పురోగతిని, పురోభివృద్ధిని సాధించటంలో వెనుకబడింది. దీనికి మళ్ళీ ప్రజాస్వామ్యం అని పేరు. నేడు రాష్ట్రం లోను దేశం లోను కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉందంటే నవ్వి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉంది.