మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ ని వీడనున్నారా?

 

మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు షాక్ తగులుతుంది అనుకున్నారంతా. కానీ కాంగ్రెస్ పెద్దలు టీజేఎస్ తో జరిపిన చర్చలు ఫలించి ఎట్టకేలకు పొన్నాలకు కాంగ్రెస్ విడుదల చేసిన మూడో జాబితాలో చోటు దక్కింది. అయితే మరో సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి మాత్రం నిరాశ తప్పలేదు. సనత్‌నగర్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మర్రిశశిధర్‌రెడ్డికి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. మహాకూటమి పొత్తులో భాగంగా సనత్‌నగర్‌ను టీడీపీకి కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో సనత్‌నగర్ అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్‌ పేరును టీడీపీ ఖరారు చేసింది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూన వెంకటేశ్‌గౌడ్ తలపడబోతున్నారు. దీంతో సనత్‌నగర్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మర్రి శశిధర్‌రెడ్డికి ఈ సారి నిరాశే ఎదురైంది.

తాజాగా మర్రి శశిధర్‌రెడ్డి ఈ విషయంపై స్పందించారు. మూడో జాబితాలోనూ తన పేరు లేకపోవడం బాధాకరమన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. కార్యకర్తలతో చర్చించి త్వరలో ఓ నిర్ణయానికొస్తానని శశిధర్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే అధిష్టానం ఆయనతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కాగా తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. కార్యకర్తలతో చర్చల అనంతరం ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొందరు ఆయన రెబెల్ గా బరిలోకి దిగే అవకాశముందని చెప్తుంటే.. మరికొందరు ఆయన కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీలో చేరే అవకాశముందని చెప్తున్నారు. మరి శశిధర్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.