కాంగ్రెస్ పార్టీలో కళంకిత సీజన్

 

ఇద్దరు మంత్రుల రాజీనామాల వ్యవహారం ఇంకా ఒక కొలొక్కి రాక మునుపే, ఆ వరుసలో ఉన్నమరో మంత్రి కె.పార్ధసారధితో నిన్నముఖ్యమంత్రి చర్చలు జరపడంతో, ఇక నేడో రేపో ఆయన కూడా ‘పార్టీకి, ప్రభుత్వానికి తన వల్ల మచ్చ ఏర్పడకూడదనే సదుదేశ్యంతోనే రాజీనామా చేస్తున్నట్లు’ మీడియా ముందుకు వచ్చి ప్రకటిస్తారేమో.

 

మిగిలిన మంత్రులవలే ఆయన జగన్ వ్యవహారంలో కాక, తన స్వంత వ్యవహరాలలోనే ప్రత్యేక కోర్టు చేత 2నెలలు జైలు శిక్ష మరియు 5.15లక్షలు జరిమానా విదింపబడిన ఏకైక మంత్రిగా నిలిచారు. అయితే ఆయన హైకోర్టు నుండి స్టే తెచ్చుకొని దానిని నుండి బయట పడ్డారు. ఆయనకు చెందిన కేపీ ఆర్ టెలీ ప్రొడక్ట్స్ సంస్థ ఫెరా నిబందనలు ఉల్లంఘించినందుకు ఈడీ అధికారులు 2003లో నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోకపోవడంతో, ఆయనపై ప్రత్యేక కోర్టులో కేసు వేసారు. కోర్టు పంపిన నోటీసులను కూడా ఆయన పట్టించుకోకపోవడంతో, కోర్టు ఆయనకు రెండు నెలలు జైలు శిక్ష, 5.15లక్షలు జరిమానా వేసింది.

 

ఈ కేసు సంగతిని ఎన్నికల ఎఫిడవిట్ లో దాచిపెట్టినందుకు ఆయన మీద ప్రజాప్రాతినిద్యం చట్టం క్రింద మరో కేసుకూడా విజయవాడ కోర్టులో నడుస్తోంది. అది కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రెండు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ‘కళంకిత మంత్రుల రాజీనామాల సీజన్’ నడుస్తోంది కనుక పైకి వచ్చింది.

 

కానీ, ముందు రాజీనామాలు చేసిన వారి సంగతే ఇంకా తేలనప్పుడు, మరో మంత్రిని ఇప్పుడు ఆ లైన్లో నిలబెట్టడం కేవలం కాంగ్రెస్ మార్క్ రాజీనామా డ్రామాగానే కనిపిస్తోంది. ధర్మాన, సబితలు ఎటువంటి పరిస్థితుల్లో రాజీనామాలు చేసారో కళ్ళకు కట్టినట్లు అందరికీ కనబడుతుంటే, ‘వారు రాజీనామాలు చేసినట్లు తనకు తెలియదని, అసలు వారిరువురినీ ఎవరూ రాజీనామాలు కోరలేదని’ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పడం చూస్తే, అసలు మంత్రులను తొలగించాలో వద్దో అనే విషయంపై కాంగ్రెస్ పార్టీలోనే సరయిన స్పష్టత లేదని అర్ధం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో మంత్రి ఉద్వాసనకి రంగం సిద్దం చేయడం హాస్యాస్పదమే అవుతుంది.

 

కళంకిత మంత్రుల లైన్లో ఉన్న మిగిలిన మంత్రులు గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మి నారాయణలకు మరికొంత కాలం వెసులుబాటు కల్పించేందుకే  ముఖ్యమంత్రి పార్ధ సారధిని ముందుకు తీసుకువచ్చారేమో తెలియదు.

 

ఏమయినప్పటికీ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సంగతిని పక్కనబెట్టి, కళంకిత మంత్రుల ఉద్వాసన చెయాలా వద్దా, చేయిస్తే ఎదురయ్యే అసమ్మతిని ఏవిధంగా ఎదుర్కొనాలి, ఖాళీ అయిన మంత్రి పదవుల కోసం మిగిలిన మంత్రుల అలకలు, కొట్లాటలను ఏవిధంగా ఎదుర్కోవాలి, తెలంగాణా యంపీల అలకలు తీర్చడం వంటి విషయాలతోనే తీరిక లేకుండా ఉంది. ఇవ్వనీ సర్ధుకొనే సరికి ఎన్నికల గంట మ్రోగితే ఇక మంత్రులందరూ ఎన్నికల హడావుడిలో పడిపోతారు. అంటే, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి అది ఒక గాడినపడే వరకు ప్రజలని పట్టించుకొనే నాధుడు ఉండడన్న మాట.