బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టో పై తీవ్రంగా మండిపడుతున్న కాంగ్రస్ నేతలు...

మహారాష్ట్ర ఎన్నికల వేడి దేశాన్ని తాకింది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ లు ఇస్తున్న హామీలు వివాదాస్పదంగా మారుతున్నాయి.వీర్ సావర్కర్ పేరు భారతరత్నకు సిఫారసు చేస్తామన్న బీజేపీ ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కమలనాథులు తాము మరోసారి అధికారంలోకి వస్తే వీరసావర్కర్ కు భారత రత్న వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీని పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ దేశాన్ని దేవుడే ఇక రక్షించాలంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. సావర్కర్ తరవాత గాడ్సే పేరును కూడా ప్రతిపాదిస్తారేమోనని  వామపక్షాలు మండిపడ్డాయి.  మహారాష్ట్ర లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే హిందుత్వ సిద్ధాంత రూపకర్త వీర్ సావర్కర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న కోసం ప్రయత్నిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. సావర్కర్ తో పాటు మహాత్మ పూలే సావిత్రిబాయి ఫూలే కు భారత రత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని కూడా వెల్లడించింది. సావర్కర్ పేరును భారత రత్నకు ప్రతిపాదించాలనే బిజెపి ఆలోచనపై విపక్షాలు మండిపడుతున్నాయి.

గాంధీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థులకు ఎగ్జామ్ లో ప్రశ్నలు ఇచ్చిన దేశంలో సావర్కర్ లాంటి వారికి భారత రత్న కూడా వస్తుందంటూ కాంగ్రెస్ ఎగతాలి చేసింది. మహత్మ గాంధి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. మరో వైపు గాంధీ నూట యాభైవ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయన్ను పొట్టన పెట్టుకున్న వారిని అత్యున్నత పురస్కారాలతో గౌరవిస్తారా అంటూ ప్రశ్నించింది. వామపక్షాలు కూడా బిజెపి మ్యానిఫెస్టో హామీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వీరసావర్కర్ తరువాత గాంధీని హత్య చేసిన గాడ్సే కూడా భారత రత్న ఇస్తారేమో నని సిపిఐ విమర్శించింది. రెండుదేశాల సిద్ధాంతాన్ని బలపరిచి గాంధీ హత్యలో భాగస్వామిగా ఉన్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ప్రశ్నించింది. మొత్తాని కి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బిజెపి మ్యానిఫెస్టోలో చేసిన ప్రస్తావన అగ్ని రాజేసింది.ఇక మ్యానిఫెస్టోనే ఇంత గోడవలకు తావునిస్తే ఎన్నికలు ఇంకేలా జరగబోతాయన్నది చూడాల్సి ఉంటుంది.