దేశ విచ్చిన్నమే దేశ భక్తా?

 

 

 

దేశ సమగ్రతను కాపాడుకోవటానికి,దేశ సంక్షేమాన్ని పరిరక్షించు కోవటానికి,ప్రపంచ దేశాలలో తనదైన స్థానాన్ని సుస్థిర పరుచుకోవటానికి స్వాతంత్ర్యాననంతరం ఆనాటి పెద్దలు 525 సంస్థానాలుగా ఉన్న భారతావనిని 25 రాష్ట్రాలుగా నెలకొల్పారు. దీని ఉద్దేశ్యం దేశ ప్రజలందరికి ఒక జాతిని నిర్దేశించి అందరిని ఒక్కతాటి మీదికి తీసుకు రావటం. ఈ 25 రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏర్పాటు చేయబడినవి. మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ భాషా ప్రాతిపదికన ఏర్పడినవే. అలా భారత దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్ట మొదటి రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్. భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పటిష్టంగా ఉండాలంటే బలమైన రాష్ట్రాలు ఉండాలని ఆనాటి నాయకుల ముఖ్య ఉద్దేశ్యం.

 

 నేటి ఆధునిక భారతదేశాన్ని  ఏలుతున్నవి సంకీర్ణ ప్రభుత్వాలు. వీటి నేపధ్యంలో అతి తక్కువమంది ఎమ్.పి లు ఉన్న పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తమ ఇష్టానుసారం శాసిస్తున్న కారణంగా నేటి మేధావులు కూడా దేశ సమగ్రతను కాపాడుకోవటానికి బలమైన రాష్ట్రాలు ఉండాలనే కోరుకుంటున్నారు.
                 
 కాని బి.జె.పి వారు తాము అధికారంలో ఉన్న సమయంలో చిన్న రాష్ట్రాలు అయితేనే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందనే అజ్ఞానంతో ఉత్తర్ ప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ నుండి ఛత్తీస్ ఘడ్,బీహార్ నుండి జార్ఖండ్ అనే మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఆ రాష్ట్రాలను అలా విభజించటం ద్వారా ఆయా రాష్ట్రాలు సాధించిన ప్రగతి ఏమిటో బి. జె. పి  వారు దేశ ప్రజలకు చెప్ప గలరా?


                 
ఛత్తీస్ ఘడ్ లోని చాలా భూభాగం మావోయిస్టుల అధీనంలో ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఉత్తరాఖండ్ ఏర్పడి ఇంత కాలమైన ఆ ప్రాంతం వారు అక్కడికి వచ్చే యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయం మీదనే ఆధారపడి బ్రతకవలిసి వస్తోంది. మొన్నటికి మొన్న వరదలోస్తే సహాయక చర్యల నిమిత్తం తక్షణ చర్యలు చేపట్టే సరైన ప్రభుత్వ యంత్రాంగం  కూడా లేని దుస్థితిలో ఆరాష్ట్రం ఉంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడి 11,12 సంత్సరాలు ఐన 9 ప్రభుత్వాలు మారి పూర్తి రాజకీయ అనిశ్చితిలో ఉంది.


                 
  తమను తాము దేశ భక్తులుగా చెప్పుకొనే బి. జె. పి వారు ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేయటం ద్వారా సంభవించిన సంక్షోభానికి  ఏ మూల్యం చెల్లిస్తారు? కాంగ్రెస్ లౌకికవాద ముసుగుతో దేశాన్ని మోసం చేస్తుందని బి.జె.పి  విమర్శిస్తూ ఉంటుంది.బి.జె. పి మతవాదం తో దేశాన్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటుంది. కానీ విధి విధానాల పరంగా ఈ రెండు పార్టీలకు ఎటువంటి భేదం కనిపించదు. ఉదాహరణకు ఎఫ్.డి.ఐ ల విషయం లో కాంగ్రెస్ ను బి.జె.పి  సమర్ధించింది. బి.జె.పి  వారు కోరుతున్నట్లుగా తెలంగాణ ఏర్పాటు చేయటానికి కాంగ్రెస్ ముందుకు వస్తోంది. వీరి చౌకబారు రాజకీయాల కారణంగా దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే,రాష్ట్రం అభివృద్ధి విషయంలో 10 సంత్సరాలు వెనక్కి పోయింది.



                   సమైఖ్యాంధ్ర ఉద్యమంతో సీమాంద్ర  ప్రాంతం  అట్టుడికి పోతుంటే రాష్ట్రం నుండి బి.జె.పి కి ప్రముఖ పాత్ర వహిస్తున్న వెంకయ్యనాయుడు ఈ సంక్షోభానికి కారణం కాంగ్రెస్సే,ఆ పార్టీనే సమాధానం చెప్పుకోవాలి అని రాజ్యసభలో వ్యాఖ్యానించటం  ఆయన తద్వారా ఆయన పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం. రాష్ట్రంలో నేటి రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో అదే స్థాయిలో బి.జె. పి పాత్ర కూడా ఉందనే విషయం ప్రజలందరికి తెలుసు. ఈ రెండు పార్టీల రాజకీయదురుద్దేశ్యమే ఈ దుస్థితికి కారణం. చిన్న రాష్ట్రాల పేరుతో దేశాన్ని విచ్చిన్నం చేయాలనే కోరుకుంటుంటే బి. జె. పి  దేశభక్తి అనే ముసుగును తొలగించు కుంటే మంచిది.