తిలాపాపం తలా పిడికెడు.. సీమాంద్రాలో మాత్రమే

 

 

 

కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన వ్యవహారం తలకెత్తుకొనప్పుడు మొదట తన అభిప్రాయం, వైఖరి చెప్పకుండా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నుండి లేఖలు తీసుకొంది. ఇప్పుడు వాటిని అడ్డంపెట్టుకొని తన రాజకీయ ప్రత్యర్ధులను బ్లాక్ మెయిల్ చేస్తోంది. అంతే గాక, అన్ని పార్టీలు విభజనకు అంగీకరించిన తరువాతనే తమ పార్టీ విభజనకు పూనుకొందని అందువల్ల ఎవరూ తమ పార్టీని తప్పు పట్టలేరని, ఒకవేళ తప్పు పట్టదలిస్తే లేఖలు ఇచ్చిన అన్ని పార్టీలను కూడా తప్పు పట్టాలని, ఈ వ్యవహారంలో తిలా పాపం తలా పిడికెడు అని వితండవాదం చేస్తోంది. కానీ, తెలంగాణా ప్రాంతంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా వాదన చేస్తోంది.



తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొన్న సోనియా గాంధీ వారికిచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా ఏర్పాటు చేసారని టీ-కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం గురించి అందరికీ తెలుసు. సీమాంద్రాలో ఈ పాపంలో అందరికీ భాగం ఉందని వాదిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో మాత్రం ఆ పాపంలో (?)ఎవరికీ వాటా పంచి ఇచ్చేందుకు సిద్డంగా లేదు. తమది జాతీయ దృక్పధం ఉన్న గొప్ప పార్టీలని గర్వంగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా ఇదే రకమయిన ద్వంద విధానం అవలంభిస్తూ రెండు ప్రాంతాల ప్రజలను మభ్యపెడుతున్నాయి.

 

రెండు ప్రాంతాలలో తమ రాజకీయ ప్రత్యర్ధులను బట్టి వేర్వేరు వ్యూహాలు అమలుచేస్తూ, ప్రజల భావోద్వేగాలను అనుకూలంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నాయి. అందువల్ల ఉభయ ప్రాంతాల ప్రజలు కూడా వారి మాటల గారడీకి లొంగిపోకుండా, విజ్ఞతతో వ్యవహరించి తమ తమ ప్రాంతాలకు మేలు చేకూర్చగల ప్రతినిధులను, పార్టీలను మాత్రమే ఎన్నుకోవలసి ఉంది.