టీఆర్‌ఎస్‌ విజయానికి కారణం ఈవీఎంల ట్యాంపరింగే.!!

 

రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ కు ఈ విజయం ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేయడం వల్ల దక్కిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. టీఆర్‌ఎస్‌ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్‌ అభ్యర్థులు సంపత్‌ కుమార్, దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. వాస్తవ ప్రజా తీర్పు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉందన్నారు. తాము అన్ని విధాలుగా విశ్లేషించుకున్నాకే ఈ ఆరోపణలు చేస్తున్నామని తెలిపారు. తమ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత, ఎన్నికల సంఘంపై ఉందన్నారు.

తాజాగా వారు గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సంపత్‌ కుమార్ మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌ సాధ్యమేనని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను వినిపించారు. ట్యాంపరింగ్‌ కుట్రకు మద్దతుగా 3 నెలల ముందే అమెరికాలోని కంపెనీ నుంచి మెయిళ్లు, వాట్సాప్‌ మెసేజ్‌లు కేటీఆర్‌కు వచ్చాయని ఆరోపించారు. దమ్ముంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ రద్దు నాటి నుంచి వాడిన సెల్‌ఫోన్లు, ఫోన్లను ఫోరెన్సిక్‌ బృందాలకు అప్పగించాలన్నారు. ట్యాంపరింగ్‌ జరిగిందని నిరూపిస్తామన్నారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలు నిజం కాదని నిరూపించేందుకు మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే లైడిటెక్టర్‌ పరీక్షకు రావాలని దాసోజు శ్రవణ్‌ సవాలు విసిరారు. 22 లక్షల ఓట్లు తొలగించి క్షమాపణ చెబితే సరిపోతుందా..? అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ను ప్రశ్నించారు. ఇదే తప్పును గల్ఫ్‌దేశాల్లో చేస్తే బహిరంగంగా ఉరి తీస్తారన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రజత్‌కుమారే అధికార పార్టీకి తొత్తుగా మారితే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాళ్లలో ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరిని ఓడించాలో ముందే నిర్ణయించుకొని ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు ఓడిపోయేలా.. అనుకూలమైన వారు గెలిచేలా ఈవీఎంలతో మాయ చేశారని విమర్శించారు. ఖైరతాబాద్‌లో ఈవీఎంలలో పోలైన ఓట్లకు, ప్రకటించిన ఓట్లకు భారీ వ్యత్యాసం ఉందన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఖాతాల నుంచి ఓట్లను టీఆర్‌ఎస్‌కు మళ్లించారని ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరగకపోతే 100 సీట్లు వస్తాయని, డీకే అరుణ, పద్మావతి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి ఓడిపోతారని ముందే కేటీఆర్‌ ఎలా చెప్పగలిగారని నిలదీశారు.