కాంగ్రెస్, బీజేపీ చేతిలో రాష్ట్ర భవిష్యత్

 

ఈరోజు ఆర్ధిక మంత్రి చిదంబరం లోక్ సభలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్రమంత్రి కావూరి నిన్న మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్రమంత్రులందరూ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేస్తామని స్పష్టం చేసారు. రాష్ట్ర విభజన బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపజేయాలనే కృత నిశ్చయంతో ఉన్నందునో లేక ఆవిధంగా నటిస్తునందునో కాంగ్రెస్ అధిష్టానం వారినందరినీ కూడా సభ నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడకపోవచ్చును. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ, కధ ఇంతవరకు వచ్చిన తరువాత మిగిలిన సీమాంధ్ర మంత్రులను సస్పెండ్ చేసినంత మాత్రాన్న కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. పైగా ఆవిధంగా చేయడం వలన ఒకవేళ ఏ కారణం చేతనయినా సభలో బిల్లు ఆమోదం పొందలేకపోయినా, దానిని ఆమోదింపజేసేందుకు తన యంపీలను, చివరికి కేంద్రమంత్రులను కూడా సభ నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడలేదని, కానీ చిత్తశుద్దిలేని బీజేపీ వలననే బిల్లు ఆమోదం పొందలేకపోయిందని తెలంగాణా ప్రజలకు దైర్యంగా చెప్పుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేస్తూ సభలో రాష్ట్రానికి చెందిన సభ్యులెవరూ లేకుండా చేసి, బిల్లుని ఆమోదించే ఆలోచనని బీజేపీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పు పడుతున్నపటికీ, కాంగ్రెస్ ఈ విషయంలో మొండిగా ముందుకే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది.

 

సీమాంధ్రలో తన పార్టీని పణంగా పెట్టయినా సరే తెలంగాణాలో రాజకీయ లబ్ది పొందాలని నిశ్చయించుకొన్న తరువాతనే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకొంది. అందువల్ల తెరాసను విలీనం లేదా కనీసం ఎన్నికల పొత్తులకయినా ఒప్పించాలంటే తప్పనిసరిగా ఏదో విధంగా బిల్లుని ఆమోదింపజేయవలసి ఉంటుంది. అలా కుదరకపోతే అందుకోసం తను శక్తి వంచనా లేకుండా కృషి చేశానని కేసీఆర్ ను నమ్మించవలసి ఉంటుంది. అప్పుడే ఆయన కాంగ్రెస్ పార్టీని కనికరిస్తారు. ఒకవేళ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినన్ని లోక్ సభ స్థానాలు సాధించినట్లయితే, తెరాస మద్దతు ఇస్తుంది. అప్పుడే రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడం వీలవుతుంది.

 

కాంగ్రెస్ తన ఈ ఆశయాన్ని, లక్ష్యాన్ని ఇన్ని నెలలలో ఎంత తీవ్రంగా ఒత్తిళ్ళు వచ్చినా ఎన్నడూ మరువలేదు, వెనక్కి తగ్గలేదు గనుక ఇప్పుడు కూడా అదే లక్ష్యంగా ముందుకు సాగవచ్చును. ఇక రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి సభలో సాధారణ మెజార్టీ సరిపోతుందని న్యాయశాఖ తేల్చి చెప్పింది గనుక, మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులను కూడా సస్పెండ్ చేసి బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసే ప్రయత్నం చేయవచ్చును.

 

ఇక ఈ వ్యవహారంలో బీజేపీ తన చేతికి మట్టి అంటకుండా బయటపడాలని భావిస్తే, కర్ర విరగ కుండా పాము చావకుండా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఏదో ఒక కుంటి సాకుతో సభ నుండి వాకవుట్ చేసి బిల్లుకి పరోక్షంగా సహకరించవచ్చును. కానీ, చంద్రబాబు ప్రభావంతో తెదేపాతో పొత్తులకే మొగ్గు చూపినట్లయితే బిల్లుపై చర్చకు పట్టుబట్టి కాలయాపన చేసి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఏమయినప్పటికే, రేపు లేదా ఎల్లుండి లోగా రాష్ట్ర భవిష్యత్ ను, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే కీలక నిర్ణయం జరుగబోతోందని ఖచ్చితం చెప్పవచ్చును.