ఎన్నికల తరువాత పొత్తులకి రంగం సిద్దం

 

తెలంగాణలో ఖచ్చితంగా తమకే అధికారం దక్కుతుందని కేసీఆర్ పదేపదే చెప్పినప్పటికీ, ముక్కోణపు పోటీ వల్ల అది సాధ్యం కాదనే సంగతి ఇప్పుడు కేసీఆర్ కూడా గ్రహించినట్లున్నారు. అందుకే మళ్ళీ ‘సోనియా దేవత, యూపీఏకి మద్దతు’ అంటున్నారు. ఎన్నికల తరువాత తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే ఆయన ఆవిధంగా మాట్లాడినట్లు అర్ధమవుతూనే ఉంది. అయితే నిన్న తెలంగాణాలో జరిగిన ఎన్నికల ముందు కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లయితే, కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు కూడా ఇక పడవనే ఆలోచనతో “కేసీఆర్ నమ్మకస్తుడు కాదు. ఆయనకీ మాట నిలకడ లేదు” అని మీడియాతో అన్నారు రాహుల్ గాంధీ. అయితే కేసీఆర్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నానని మాత్రం అనలేదు. ఇకపై రాహుల్ సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం చేయవలసి ఉంది గనుక, కేసీఆర్ పై మరింత తీవ్రంగా విమర్శలు గుప్పించవచ్చును. తద్వారా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్న సీమాంధ్రులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చు. నిన్న నరేంద్రమోడీ తన ప్రసంగంలో తాను అధికారంలోకి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులన్నీ వెలికితీస్తానని ముందే హెచ్చరించారు. గనుక, సహజంగానే జగన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపవచ్చును. ఇంతకాలం కాంగ్రెస్, వైకాపాలు విమర్శలు చేసుకొన్నపటికీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకొన్నా ప్రజలకి జవాబు చెప్పనవసరం లేదని అందరికీ తెలుసు.