పతాకస్థాయిలో కాంగ్రెస్-తెరాసల యుద్ధం

 

తెలంగాణాలో ఎన్నికలకు ఇంకా కేవలం 11రోజులు సమయం మాత్రమే ఉండటంతో కాంగ్రెస్, తెరాసల మధ్య మాటల యుద్ధం చాలా భీకరంగా సాగుతోంది. వారి యుద్ధం ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే ఇప్పుడు తెదేపా-బీజేపీ నేతల ప్రచారాన్ని కూడా అది మరుగున పడేసేంతగా సాగుతోంది. మొదట రెండు మూడు ప్రజాగర్జన సభలను విజయవంతంగా నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిన చంద్రబాబు, ఇప్పుడు సీమాంధ్రకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నందున, కాంగ్రెస్, తెరాసలతో పోలిస్తే, తెదేపా ప్రచారంలో కొంచెం వెనుకబడిపోయినట్లే కనబడుతోంది.

 

కేసీఆర్ తెలంగాణా పది జిల్లాలలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ గట్టిగా ప్రచారం చేస్తుంటే, ఇటీవల తెరాస నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన శ్రావణ్ కుమార్, తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలు తెరాస నేతలను, కేసీఆర్ ను బలంగా డ్డీ కొంటున్నారు. కానీ, తెలంగాణా ఏర్పాడిన తరువాత మొట్ట మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరీంనగర్లో నిర్వహించిన సభకు, ఆశించినంత స్పందన కరువవడం గమనిస్తే తెరాస ఆధిక్యత కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

 

మళ్ళీ ఈనెల 21న రాహుల్ గాంధీ మెహబూబ్ నగర్ మరియు నిజామాబాదు నగరాలలో రెండు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మళ్ళీ 25న మెదక్ మరియు హైదరాబాదులో మరో రెండు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఆ తరువాత మళ్ళీ సోనియా గాంధీ 27న తెలంగాణాలో మరొక బహిరంగ సభ నిర్వహించనున్నారు.

 

వీరిరువురి ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకొనే అవకాశం ఉన్నపటికీ, టీ-కాంగ్రెస్ నేతల మధ్య సరయిన సయోధ్య లేకపోవడం, వారినందరినీ ఒక్క త్రాటిపై నడిపించగల బలమయిన నాయకుడు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ సమస్య తెరాసకు కూడా ఉందనే చెప్పవచ్చును. ఆ పార్టీలో కొందరు బలమయిన నేతలున్నపటికీ, వారందరూ తమ తమ నియోజక వర్గాలకే పరిమితమయి పోవడంతో, మిగిలిన అభ్యర్ధులు అందరూ కేసీఆర్ ప్రచారంపైనే ప్రధానంగా ఆధారపడుతున్నారు. అందువల్ల హేమాహేమీలయిన కాంగ్రెస్ నేతలందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడితే తప్పకుండా తెరాసపై పై చేయి సాధించవచ్చును.

 

తెదేపా-బీజేపీలకు సీమాంధ్రలో పొత్తులపై కుస్తీలు పడుతూ తీరికలేకపోవడంతో ఆ రెండు పార్టీలు రంగంలో దిగేందుకు ఇంకా ముహూర్తం నిర్ణయించుకొన్నట్లు లేదు. ఈరోజు పొత్తుల కధ ఒక కొలిక్కి వస్తే, 22న మోడీ సభతో ప్రచారం మొదలు పెడతారేమో!