కాంగ్రెస్ దెబ్బకి రాహుల్ భవిష్యత్ ఫినిష్!

 

ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలకు ఈసారి ఎన్నికలు అతిముఖ్యమయినవి. తెరాస, వైకాపాలు మొట్ట మొదటిసారిగా ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకొనేందుకు తహతలాడుతుంటే, తెదేపా ఈ ఎన్నికలలో గెలవకపోతే తన ఉనికే ప్రమాదం గనుక విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడేందుకు సిద్దం అవుతోంది. ఇక రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్, అందుకు సహకరించిన బీజేపీలు మాత్రం ఈ రేసులో అందరి కంటే వెనుకబడిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ, బీజేపీ-తెదేపాల మద్య ఎన్నికల పొత్తులు కుదిరితే బీజేపీ కూడా బలపడే అవకాశం ఉంటుంది. కానీ, తెరాస హ్యాండివ్వడంతో తెలంగాణాలో, పార్టీ దాదాపు ఖాళీ అయిపోయిన కారణంగా సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ ఘోరంగా దెబ్బ తినబోతోంది.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేకపోయినా, కనీసం దేశంలో మిగిలిన రాష్ట్రాలలోనయినా విజవకాశాలు ఉండి ఉంటే, ఎన్నికల తరువాత ఆంధ్ర, తెలంగాణాలలో ఎన్నికయిన పార్టీలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడి ఉండేవి. కానీ, దేశంలో వివిధ రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలదే పూర్తి రాజ్యం నడుస్తోంది గనుక కాంగ్రెస్ పార్టీ ఏవో రెండు మూడు ఈశాన్య రాష్ట్రాలలో, దక్షిణాన్న కర్ణాటకలో తప్ప మరెక్కడా గెలిచే అవకాశాలు కనబడటం లేదు. కనీసం దాని మిత్రపక్షాలయినా గెలిస్తే కొంతలో కొంత ఊరట లభిస్తుంది. కానీ మోడీ మాయలో పడి వారు కూడా ఎన్డీయే కూటమికి జంపైపోతే ఇక కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనే కల పగటికలగానే మిగిలిపోతుంది. ఇదంతా కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు.

 

కాంగ్రెస్ అధిష్టానం చాలా దురాలోచన చేసి దక్షిణాదిన తనకు కంచుకోట వంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్నితన హస్తాలతో తానే స్వయంగా బ్రద్దలు కొట్టుకొని, కన్నకొడుకుల వంటి స్వంత పార్టీ నేతలను కాదని, వేరెవరి చేతికో అధికారం అప్పజేప్పెందుకు  సిద్దం అయ్యింది. తత్ఫలితంగా ఈసారి కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలంత మెజార్టీ సాధిస్తే తప్ప, రాష్ట్రం నుండి ఎవరి మద్దతు దొరకదు. సోనియా గాంధీ తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని ఎలాగయినా ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఇంత రిస్క్ తీసుకొని కధ నడిపిస్తే చివరికి అదే కారణంగా రాహుల్ గాంధీ శాశ్వితంగా ప్రధాని పదవికి దూరం అయ్యేలా ఉన్నారు.   కాంగ్రెస్ నిసహ్హాయ స్థితి, రాహుల్ గాంధీ భవిష్యత్తు తలచుకొంటే పాపం జాలేస్తుంది.