టీ-జేఏసీ నేతలకు కాంగ్రెస్, తెదేపా వల

 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్  ఎన్నికలలో ఎలాగయినా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయంలో ఇంతకాలం తనతో కలిసి తెలంగాణా ఉద్యమాలు చేసిన విద్యార్ధులను, జేఏసీ నేతలను పక్కనబెట్టి, గెలుపు గుర్రాల కోసం చూస్తుండటంతో వారందరూ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొన్న జరిగిన టీ-జేఏసీ సమావేశంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తమను కాదని కొండా సురేఖ వంటి తెలంగాణా ద్రోహులను పార్టీలో జేర్చుకొని టికెట్స్ కేటాయించడాన్ని వారు తీవ్రంగా తప్పు పట్టారు. ఇక తెలంగాణా ఉద్యమాలలో అందరికంటే ముందుండి పోలీసుల చేతిలో లాటీ దెబ్బలు తిని, నేటికీ కేసులు ఎదుర్కొంటున్న ఉస్మానియా జేఏసీ విద్యార్ధులను కూడా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వారు కూడా తమ తరపున కొందరు విద్యార్ధులను ఎన్నికలలో అభ్యర్ధులుగా నిలబెట్టబోతున్నట్లు ప్రకటించారు.

 

అయితే దీనినొక అవకాశంగా భావించిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఉడుకు రక్తం గల విద్యార్ధుల కంటే జేఏసీ నేతలనే మంచి చేసుకొన్నట్లయితే లక్షలాది ఉద్యోగుల, వారి కుటుంబాల ఓట్లు రాల్చుకోవచ్చనే ఆలోచనతో, జేఏసీ నేతలు కాంగ్రెస్ లో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని వారు గనుక పార్టీలోకి వచ్చినట్లయితే తగిన విధంగా గౌరవించి ఆదరిస్తామని చెపుతూ వారిని పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదేవిధంగా తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న వివిధ జేఏసీలలో యువకులను పార్టీలోకి ఆకర్షించి వారికి టికెట్స్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేసారు.

 

ఈవిధంగా కాంగ్రెస్, తెదేపాలు జేఏసీ నేతలను తమవైపు త్రిప్పుకొనే ప్రయత్నాలు చేయడం చూసి తెరాస కూడా అప్రమత్తమయింది. టీ-యన్జీవో ఉద్యోగుల నాయకుడు శ్రీనివాసులు రెడ్డికి ఇప్పటికే టికెట్ ఖరారు చేయగా త్వరలోనే మరికొందరికి కూడా పార్టీకి బలం లేని నియోజక వర్గాలలో వారికి టికెట్స్ కేటాయించి వారి నోటనే తాము పోటీ చేయబోమని చెప్పించి నెపం తన మీద పడకుండా తెలివిగా తప్పుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీని వల్ల తెరాస నెపం తన మీద పడకుండా తప్పుకోవచ్చేమో కానీ పార్టీ పట్ల వారికేర్పడిన వ్యతిరేఖతను మాత్రం తగ్గించలేదు.