కాంగ్రెస్ నేతలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న చంద్రబాబు

 

ఈరోజు మాజీ కాంగ్రెస్ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి మరియు శిల్పా మోహన్ రెడ్డిలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. అదేవిధంగా మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మరియు ఆమె కుమారుడు గల్లా జయదేవ్ ఇద్దరూ కూడా నిన్ననే పార్టీలో చేరారు. ఇక నిన్న మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డితో రాసుకు పూసుకు తిరిగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు ఇప్పుడు చంద్రబాబు పంచన చేరారు. బహుశః రానున్న మరికొద్ది రోజులలో ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు వారి అనుచరులు తెదేపాలోకి బారులు తీరి తరలి రావచ్చును.

 

ఇప్పుడు వారందరూ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తేస్తూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నేతలు కండువాలు మార్చుకొంటున్నపుడు ఇటువంటివి సహజమే. కాంగ్రెస్ అధిష్టానం వారిని మోసగిస్తే, వారు కాంగ్రెస్ పార్టీకి హ్యాండిస్తున్నారు. ప్రభుత్వం రద్దయ్యే చివరి నిమిషం వరకు పదవులను పట్టుకొని వ్రేలాడిన ఈ నేతలందరూ, తమ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకొనేందుకు, యం.యల్యే. టికెట్స్ కోసమే తెదేపాలోకి దూకారని అందరికీ తెలుసు. ఇంత కాలంగా సోనియా, రాహుల్ గాంధీలకు భజనలో తరించిన వారందరూ ఇప్పుడు పచ్చకండువా కప్పుకోగానే చంద్రబాబు భజన మొదలుపెట్టేసారు. ఆయన నిజాయితీ, కార్యదీక్ష, పట్టుదల, సమర్దతల గురించి నోరారా వర్ణించుతూ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని పొగడ్తలతో ముంచెత్తేసారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన వారందరూ ఇక ముందు తెదేపాను బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నారు.

 

ఇటువంటి వారిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించి, వారు అవకాశవాద కాంగ్రెస్ నేతలు కారని ప్రజలకు ఏవిధంగా నచ్చచెప్పగలరు? వారు పార్టీ కండువాలు మార్చినంత తేలికగా ప్రజలకు వారిపట్ల ఉన్న అభిప్రాయలు మారవని విశేష రాజకీయ అనుభవం గల ఆయనకీ తెలియక పోదు. అటువంటప్పుడు వారు తెదేపా తరపున పోటీ చేసి ఓడిపోతే, నష్టం పార్టీకే కాని వారికి కాదనే సంగతి కూడా ఆయనకీ తెలియక పోదు. కానీ, ఎన్నికల ముందు అటువంటి బలమయిన నేతల రాకతో పార్టీ మరింత బలపడుతుందని చంద్రబాబు భావిస్తున్నందునే వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లున్నారు.

 

అయితే వారందరూ కూడా తమకు పార్టీలో టికెట్ ఖరారు చేసుకొన్న తరువాతనే పార్టీలో చేరారు తప్ప తెదేపాకు సేవచేయడానికో లేకపోతే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికో కాదు. మరి అటువంటి వారు ఇప్పుడు తెదేపాను బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని ఇస్తున్న హామీలను ఎంతవరకు నమ్మవచ్చో చంద్రబాబే ఆలోచించుకోవలసి ఉంది. పదవులు, పార్టీ టికెట్స్ కోసం ఇంత తేలికగా కాంగ్రెస్ పార్టీతో బందాలు తెంపుకొని గుంపులు గుంపులుగా తరలివస్తున్న ఇటువంటి నేతలు, ఒకవేళ ఎన్నికల తరువాత తెదేపా మెజార్టీ సాధించలేకపోతే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆ పార్టీలోకి తరలివెళ్లిపోవడం ఖాయం.

 

అందువలన చంద్రబాబు కాంగ్రెస్ నుండి తరలి వస్తున్నఇటువంటి నేతలకు కాక చిరకాలంగా నమ్మకంగా పార్టీనే అంటిపెట్టుకొని సేవలు చేస్తున్న వారికే తొలి ప్రాధాన్యం ఈయడం వలన పార్టీపై నేతలకు శ్రేణులకు నమ్మకం పెరుగుతుంది. తద్వారా పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుంది కూడా. ఇంతకాలం సోనియా, రాహుల్ గాంధీలకు వీరభజన చేసిన ఈ నేతలందరూ, కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగానే ఇప్పుడు గుంపులు గుంపులుగా తెదేపాలోకి ప్రవేశించి, ఎన్నికలవగానే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయే ఆలోచనతోనే వచ్చి చేరుతున్నారేమో? అప్పుడు తెదేపా కూడా ఇప్పడు కాంగ్రెస్ ఖాళీ అయినట్లే అయిపోయినా ఆశ్చర్యం లేదు. అందువల్ల చంద్రబాబు మరింత అప్రమత్తతో మెలగడం చాలా అవసరం.