ఇక రాజీనామాల పర్వం మొదలు

 

విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి ముఖ్యమంత్రి, మరి కొందరు మంత్రులు, యంపీలు ధిక్కార స్వరం వినిపిస్తూనే తమ వల్ల అధిష్టానానికి కానీ, రాష్ట్ర విభజన ప్రక్రియకు గానీ ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకొంటూ ఇంతవరకు తీసుకువచ్చారు. అందుకోసం వారు రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలు, కోర్టు కేసులు, రాష్ట్రపతికి అభ్యర్ధనలు, దీక్షలు, మీడియా సమావేశాలు, బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానాలు చివరికి డిల్లీలో కూడా ధర్నాలు చేసారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నేటికీ అందరూ తమ తమ పదవులలోనే కొనసాగుతున్నారు.

 

అయితే ఇప్పుడు ‘నిజమయిన రాజీనామాల’ సమయం ఆసన్నమయింది. ఇక విభజన బిల్లు నేడో రేపో పార్లమెంటులో ప్రవేశపెట్టబడబోతోంది గనుక సీమాంధ్ర ప్రజలలో ఉన్న ఆవేదనను, కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేఖతను పూర్తిగా ‘క్లెయిం’ చేసుకొనే సమయం రానే వచ్చింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆరుగురు కాంగ్రెస్ యంపీలు పార్టీ నుండి బహిష్కరించబడ్డారు. వారందరికీ సీమాంధ్ర ప్రజల పుష్కలమయిన సానుభూతి!

 

ఇక ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ కాలపరిమితి కూడా త్వరలోనే ముగిసిపోతుంది. ఇంకా పదవులు పట్టుకొని వ్రేలాడటం కంటే, రాజీనామాలు చేసి బయటపడి త్యాగమూర్తుల లిస్టులో తమ పేర్లు నమోదు చేయించుకొంటేనే రానున్న ఎన్నికలలో ఓట్లు రాలే అవకాశం ఉంటుంది గనుక, ఇక నేడో రేపో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేకమంది మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేసేస్తారు.

 

రాష్ట్ర విభజనకు ఇంతగా సహకరించిన తరువాత కూడా వీరందరూ సీమాంధ్ర ప్రజల నుండి సానుభూతిని, జేజేలను అందుకోగలగడమే కాంగ్రెస్ రాజకీయాలకు పరాకాష్టగా ఒప్పుకోకతప్పదు. ప్రజలు ఏ కాంగ్రెస్ పార్టీని చ్చీ కొడుతున్నారో ఆ పార్టీకే ఓట్లు వేయించాలనుకోవడం కాంగ్రెస్ రాజకీయ చతురతకు అద్దం పడుతోంది.