పాక్ దుశ్చర్యపై అధికార విపక్షాలు యుద్ధం

 

రెండు రోజుల క్రితం కొందరు తీవ్రవాదులు మరియు పాకిస్తాన్ సైనికులు కలిసి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లా పూంచ్ వద్ద భారత్ భూభాగంలోకి జొరబడి ఐదుగురు సరిహద్దు భధ్రతా సిబ్బందిని కాల్చి చంపారు. ఈ విషయాన్నీభారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ స్వయంగా దృవీకరించారు. అయితే, రక్షణ మంత్రి ఏకే ఆంథోనీ ఈ విషయాన్నీలోక్ సభకు వివరిస్తూ “కొందరు తీవ్రవాదులు మరియు పాకిస్తాన్ సైనికుల దుస్తులలో ఉన్న మరికొందరు వ్యక్తులు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని” చెప్పడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు తెలియజేసాయి.

 

ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ స్వయంగా “తీవ్రవాదులతో కలిసి పాక్ సైనికులు భారత సైనికులపై దాడి చేసి హతమార్చారని” స్పష్టంగా దృవీకరించినప్పుడు, మరి రక్షణ మంత్రి పాక్ సైనికులను తప్పుపట్టకపోగా, వేరెవరో వ్యక్తులు పాక్ సైనికుల దుస్తులలో వచ్చినట్లు పేర్కొంటూ, మన సైనికులను పొట్టన బెట్టుకొన్న పాక్ సైనికులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని నిలదీశారు. అసలు ఆర్మీ చీఫ్ చెప్పిన మాటలను ఎందుకు మార్పు చేశారు? మన భూభాగంలోకి జొరబడి మన సైనికులను పొట్టన బెట్టుకొంటున్న పాక్ సైనికులకీ, పాక్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ది చెప్పకపోగా వారిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారు? వారిని ప్రసన్నం చేసుకోవలసిన అవసరం మనకేమవసరం? అని బీజేపీ ప్రశ్నించింది. రక్షణ మంత్రి ఆంథోనీ యావత్ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్లమెంటును స్తంభింపజేసింది.

 

సాక్షాత్ రక్షణ మంత్రే ఆవిధంగా చెప్పడం వలననే పాకిస్తాన్ ప్రభుత్వం అది తమ సైనికుల పని కాదని, ఆదాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని, అసలు తమ సైనికులు అటువంటి తప్పులు ఎన్నడూ చేయరని, ఉభయ దేశాల మధ్య 2002 జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తామెన్నడూ జవదాటలేదని, భారత్ సైనికులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తిరిగి ప్రత్యారోపణలు చేసింది.

 

పాక్ ప్రభుత్వం తప్పించుకోవడానికి, తిరిగి ఈవిధంగా ప్రత్యారోపణలు చేయడానికి రక్షణ మంత్రి ఆంథోనీ చేజేతులా అవకాశం కల్పించారని అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉభయ సభలను స్తంభింపజేసింది. దీనితో రక్షణలో పడిన రక్షణ మంత్రి మళ్ళీ పూర్తి వివరాలతో వచ్చి సభకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు.

 

బీజేపీ చేస్తున్న ఈ దాడి నుండి తనను తానూ ఎలాకాపాడుకోవాలా అని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే ఆపార్టీని ఏవిధంగా ఈ వ్యవహారంలో దోషిగా నిలబెట్టాలా అని బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే, రెండు పార్టీలు కూడా పాక్ చేతిలో మన సైనికులు చనిపోయారనే బాధ కానీ, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే చర్చకానీ, పాక్ ప్రభుత్వానికి భారత్ ప్రభుత్వం తరపున తీవ్ర హెచ్చరిక జారీ చేయాలనీ కానీ ఆలోచించకపోవడం చాలా విచారకరం.

 

దేశ రక్షణ విషయంలో కూడా ఈవిధంగా రెండు ప్రధాన పార్టీలు రాజకీయ చదరంగం ఆడుకోవడం పాక్ సైనికుల దుశ్చర్యకంటే కూడా హీనాతిహీనమయినది. గతంలో కూడా పాక్ సైనికులు తీవ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి జొరబడి ఇద్దరు బారత సైనికుల తలలు నరికి అందులో ఒకరి తల తమ వెంట తీసుకుపోయారు. అప్పుడు కూడా ఈ రెండు పార్టీలు ఇదేవిధంగా పార్లమెంటు సాక్షిగా కత్తులు దూసుకొన్నాయి తప్ప ఆ సంఘటన నుండి ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదు. కనీసం అందుకు సిగ్గు కూడా పడలేదు.

 

పైగా ఇప్పుడు మరో సారి అదే డ్రామా మొదలుపెట్టాయి. ఎంత గంభీరమయిన సమస్యనయినా కేవలం రాజకీయకోణం లోంచి మాత్రమే చూడగలిగే ఇటువంటి నేతలున్నంత కాలం పాక్, చైనా, శ్రీలంక అన్ని దేశాలు కూడా నిర్భయంగా దాడికి పాల్పడుతూనే ఉంటాయి. ఇటువంటి ఘటనలు జరిగినసారి మన రాజకీయ పార్టీలు ఇదే తంతు నిర్వహించి చేతులు దులుపుకొంటునే ఉంటాయి.