కాంగ్రెస్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ వ్యూహం

 

కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనేందుకు అవసరమయిన యంపీలను అందించే రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా ప్రధానమయినది. కానీ, రాష్ట్రంలో ఒక వైపు తెలంగాణా, మరో వైపు తెదేపా, వైకాపాలు ఈసారి కాంగ్రెస్ కు బలమయిన సవాలు విసురుతున్నారు. ఈ మూడు సమస్యలని ఒకేసారి అధిగమించాలంటే వాటిని బలహీనపరచడమే మార్గం.

 

అందుకే బ్రిటిష్ వాళ్ళు ఒకనాడు మన దేశంలో దిగ్విజయంగా అమలు చేసిన ‘విభజించు, పాలించు’ సూత్రాన్నే కాంగ్రెస్ కూడా ఎంచుకొంది. దానితో ఊహించినట్లుగానే ముందుగా జగన్ మోహన్ రెడ్డి, ఆ తరువాత కేసీఆర్ ఈ ఆటలో అవుట్ అయిపోయారు. ఇక, మిగిలింది తెదేపా. ఆ పార్టీ నేతలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలలో పాల్గొనడంతో ఈ రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ పై చేయి సాధించలిగింది.

 

ముందుగానే అందరి దగ్గర రాష్ట్ర విభజనకు అంగీకారపత్రాలు తీసుకోవడం కూడా ఈ ఆటలో భాగమేనని అర్ధం అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న వారందరికీ ఆ లేఖలు చూపి సమాధానం చెప్పమని నిలదీస్తూ, అటు తెలంగాణా, ఇటు సీమంధ్ర ప్రజల ముందు వారిని దోషులుగా నిలబెట్టగలుగుతోంది.

 

ఈ రాజకీయ చదరంగంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఓడిపోతున్నట్లు కనిపిస్తున్నపటికీ, త్వరలోనే ప్రత్యర్ధులపై పైచేయి సాధించడం తద్యం. ఇప్పటికే తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పని పరిస్థితి కల్పించింది. ఇక కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా రాజీనామాలు చేసి సమైక్యవాదంతో చెలరేగిపోతున్న తన సీమంద్రా నేతలతో చర్చల నాటకం మొదలుపెట్టేందుకు కాంగ్రెస్ ఒక కమిటీని కూడా ప్రకటించింది.

 

వారు ఆ కమిటీ తో వరుస సమావేశాలవుతూ డిమాండ్స్ చేస్తుంటే, కాంగ్రెస్ వారికి తలోగ్గుతున్నట్లు నటిస్తూ ఒకటొకటిగా వరాలు ప్రకటిస్తూ ఉద్యమాన్ని కూడా చల్లార్చడం ఖాయం. రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యేవరకు ఈ డ్రామా కొనసాగించిన తరువాత, కేంద్రం మెడలువంచి తాము చాలా భారీవరాలు రాబట్టామని చెప్పుకొంటూ సీమంద్రా కాంగ్రెస్ నేతలు కూడా తమ రాజీనామాలు వెనక్కు తీసుకోగానే, కాంగ్రెస్ ఎన్నికల గంట కొట్టేస్తుంది.

 

దానితో ఎన్నికలకి సిద్దంగా లేని ప్రతిపక్షాలు అడ్డుగా దొరికిపోతాయి. వెంటనే అవి కూడా ఉద్యమం పక్కనపడేసి ఎన్నికలు, టికెట్స్ హడావుడిలో పడతాయి. కానీ అప్పటికే సమయం మించిపోతుంది. ఎందుకంటే, కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలో పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య కాదు. కానీ తెదేపా, వైకాపా, తెరాసలకు మాత్రం చాల కష్టమే.

 

కాంగ్రెస్ పార్టీ ఈ స్కెచ్ అంతా ముందే సిద్దం చేసుకొన్న తరువాత, తెలంగాణా సాధన సభ పెట్టించేసి కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇవ్వబోతున్నట్లు లాంచన ప్రకటన చేసేసి, వెన్వెంటనే కోర్ కమిటీలు, వర్కింగ్ కమిటీలు అంటూ కొంచెం హడావుడి చేసి వారం వర్జ్యం అన్నీ చూసుకొని, ఎప్పుడో చాలకాలం క్రితమే తీసుకొన్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించేసింది.

 

ఊహించినట్లుగానే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు హటాత్తుగా మీదపడబోతున్న ఎన్నికల సంగతి మరిచి ఉద్యమాలు చేసుకొంటూ ‘సమైక్య చాంపియన్ షిప్’ కోసం పోటీలు పడుతున్నాయి. అవి ఈ ఏమరపాటుగా ఉన్న తరుణంలోనే ఎన్నికలకు వెళితే వాటిని పూర్తిగా దెబ్బ తీయవచ్చునని కాంగ్రెస్ వ్యూహం. చాలా క్రితమే రాహుల్ గాంధీ దూతలు రాష్ట్రంలో పర్యటించి గెలుపు గుర్రాల పేర్లను నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేసి ఆయన చేతిలో పెట్టడం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఎన్నికలకి పూర్తిగా సన్నాహాలు పూర్తిచేసుకొన్న తరువాతనే రాష్ట్ర విభజన ప్రకటన చేసినట్లు అర్ధం అవుతోంది.

 

వీలయినంత వేగంగా రాష్ట్ర విభజన ప్రక్రియను, దానితో బాటే సమాంతరంగా చర్చల డ్రామాను కూడా పూర్తి చేసి, డిసెంబరు నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో బాటు సాధారణ ఎన్నికలను కూడా నిర్వహిస్తే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో పూర్తి అనుకూల ఫలితాలు రాబట్టవచ్చునని కాంగ్రెస్ వ్యూహం.