7 గంటలకు తెలంగాణపై ప్రకటన

 

కొద్ది సేపటి క్రితం ముగిసిన యుపీయే మిత్ర పక్షాల సమావేశంలో పాల్గొన్న అన్నిభాగస్వామ్య పార్టీలు తెలంగాణా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయానికి తమ ఆమోదం తెలిపాయి. దాదాపు 50 నిమిషాలు సాగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దలందరూ మరియు యుపీయే భాగస్వాములయిన అజిత్ సింగ్, శరద్ పవర్, ఫరూక్ అబ్దుల్లా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన అజిత్ సింగ్ తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు.

 

ప్రస్తుతం సోనియా గాంధీ నివాసంలో కీలకమయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మొదలయింది. అయితే, ఈ కమిటీలో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సభ్యులు కాకపోవడం చేత వారిని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. తెలంగాణా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ అధిష్టానం కేవలం తన నిర్ణయాన్ని ఆమోదించడానికి మాత్రమే ఈ సమావేశం నిర్వహిస్తోంది.

 

అ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణా ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటన చేస్తుంది. రేపు జరగనున్నకేంద్ర క్యాబినెట్ సమావేశంలోయుపీయే మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు తీసుకొన్ననిర్ణయాన్నిఆమోదం పొందిన తరువాత, దానిని రాష్ట్రపతి అనుమతికి పంపుతారు. అప్పుడు రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభకు ఆ ప్రతిపాదనను పంపి దానిపై తీర్మానం కోరుతారు. రాష్ట్ర శాసనసభ తెలంగాణా బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేసినట్లయితే, అప్పుడు దానిని పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఒకవేళరాష్ట్ర శాసనసభ తెలంగాణాను వ్యతిరేఖిస్తూ తీర్మానం చేసినప్పటికీ, కేంద్రందే అంతిమ నిర్ణయం గనుక యుపీయే ప్రభుత్వం తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతుంది. పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుంది.

 

ఇప్పుడు రాష్ట్ర విభజన ఖాయమని తెలిసిపోవడంతో, ఇక హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ ఏవిధమయిన నిర్ణయం తీసుకొంటుందనే విషయం తేలవలసి ఉంది. అయితే ఆ విషయంపై ఇప్పటికిప్పుడు ప్రకటన చేయక పోవచ్చును. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు మాత్రమే సూత్రప్రాయంగా ఒక ప్రకటనతో సరిపెట్టవచ్చును.