మీడియాకు ముడిసరకు అందిస్తున్న కాంగ్రెస్

 

ఏదో ఒక చిన్న పాయింటుని మీడియాకు లీక్ చేస్తే, దానిని పట్టుకొని రాజకీయపార్టీలు, మీడియా తీవ్రంగా చర్చించుకొంటూ కొన్ని రోజులు తన జోలికి రాకుండా ఉంటాయని కాంగ్రెస్ ఆలోచన. అందుకే ఒకసారి తెలంగాణా ప్యాకేజీ, మరోసారి రాయల తెలంగాణా, ఇప్పుడు పదిరోజుల్లో తెలంగాణా అంటూ చర్చలకు అవసరమయిన ముడి సరుకుని కాంగ్రెస్ పార్టీ ఉదారంగా అందిస్తోంది.

 

తెలంగాణా ప్యాకేజీని పట్టుకొని పదిరోజులు తీవ్ర చర్చలు, ఖండనల తంతు ముగిసిన వెంటనే రాయల తెలంగాణాని చర్చకు ఇచ్చింది. ఆ తరువాత 10 రోజుల్లో తెలంగాణా అనే టాపిక్ చర్చకు ఇచ్చి దిగ్వజయ్ సింగ్ ఎంచక్కా విమానం ఎక్కి వెళ్ళిపోయారు.

 

ఈసారి డెడ్ లైన్ నెలరోజుల నుండి 10 రోజులకి తగ్గించడంతో, నిజంగా తెలంగాణా కోరుకొనేవారిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటే, మరికొందరు మాత్రం ఇప్పటికిప్పుడు తెలంగాణా ఇచ్చేస్తామంటే మా పరిస్థితి ఏమిటని? కంగారు పడుతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం, “నెలంటే ముప్పై రోజులు కాదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా 10 రోజులంటే 10 రోజులు కాదని ఖచ్చితంగా చెపుతుందని” కాంగ్రెస్ మీద కొండంత భరోసాతో ఉన్నాడు.

 

సీమంద్రా నేతలు మళ్ళీ రాజీనామాలు చేస్తామని హూంకరిస్తుంటే, టీ-కాంగ్రెస్ నేతలు వారిపై విరుచుకు పడుతున్నారు. తెదేపా వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని లగడపాటి ఆరొపిస్తుంటే, కాదు జగన్ వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి టీ జీ వెంకటేష్ శలవిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మీడియాకి మరో పదిరోజులకి సరిపడే మేతవేసి దిగ్విజయంగా తన యాత్ర ముగించుకొన్నారు సింగు గారు.