విస్మయంలో విశాఖ వాసులు.. అసలు రాజధాని ఇక్కడ ఉంటుందా?లేదా?

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తరువాత ఉత్తరాంధ్రలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా సందడి చేశారు. జగన్ చిత్ర పటాలకి పాలాభిషేకం చేస్తూ పండుగ చేసుకున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం ఖాయమని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడంతో పాటు భీమిలి నియోజక వర్గ పరిధిలోకే రాజధాని వస్తుందంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఈ తరుణంలో వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ నిర్ణయాన్ని స్వాగతించటం మొదలు పెట్టారు. ఈ లోపు జీఎన్ రావు కమిటీ నివేదిక రావడం అది ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు దగ్గరగా ఉండటంతో అమరావతిలో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రకటన అనంతరం మంత్రులు అవంతి, బొత్స సహా విజయసాయిరెడ్డి ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు , ఇతర నేతలు సీఎం జగన్ కు జేజేలు పలికారు. టిడిపికి చెందిన విశాఖ నేతలు సైతం ఇక్కడ రాజధాని ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతించేలా మాట్లాడక తప్పలేదు. అయితే అమరావతి రైతుల సమస్యలను కూడా తీర్చాలని వారు కోరారు.  

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తర్వాత విశాఖ ఉత్సవ్ లో పాల్గొనేందుకు సీఎం జగన్ విచ్చేశారు. ఆయనకు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించి తరువాత రాజధాని విషయం పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా జగన్ వెళ్ళిపోయారు. ఈ పరిణామంతో విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసులు విస్మయానికి గురయ్యారు. దీంతో ఆ ప్రాంత ప్రజల స్వరంలో మార్పు వచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతిని కాదని జగన్ నిస్పష్టంగా చెప్పలేదు. హైపవర్ కమిటీ నివేదిక వచ్చాకే మూడు రాజధానుల అంశంపై తుది నిర్ణయం అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో రాజధాని తథ్యమని ఆయన చెప్పడం లేదు అని సాగర తీర ప్రజానీకం చెప్పుకుంటోంది. ప్రశాంతంగా ఉన్న విశాఖను రాజధానిగా మారిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని భారీ నిర్మాణాలు జరిగి జనసాంద్రత పెరిగిపోతుందని.. ట్రాఫిక్ రోదతో అల్లాడిపోతామని కొందరు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. అమరావతిలో చంద్రబాబు ముద్ర కనిపించకుండా చేయాలనే దురుద్దేశంతోనే అధికార వికేంద్రీకరణ అనే ముసుగులో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాప్టల్ అనే కొత్త రాజకీయానికి జగన్ తెరతీశారని కొందరు వాదిస్తున్నారు.