అయోమయంలో కమలనాథులు.. అభ్యర్థులను ఖరారు చెయ్యని బీజేపీ 

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ సన్నాహాలు మొదలుపెట్టాయి. అభ్యర్థులకు బి ఫామ్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ బీజేపీ మాత్రం అభ్యర్థులపై ఇప్పటి వరకు ఎటూ తేల్చలేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా అభ్యర్థుల ఎంపికపై పార్టీ నాయకత్వం మౌనంగా ఉండటం పై బీజేపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మజ్లిస్ తో ప్రధాన పోటీ అంటున్న కమలనాథులకు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. అన్ని మున్సిపాలిటీలు వార్ జోన్ లో పోటీ చేస్తామని కమలనాథులు పదేపదే ప్రకటిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీంతో కింది స్థాయి కార్యకర్తలు , ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 

2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి నాలుగు స్థానాలను గెలిచి అందరికీ షాకిచ్చింది. దీన్ని ఉపయోగించుకోవాలని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు భావించారు. అయితే అభ్యర్థుల ఖరారులో బిజెపి నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఈ నేతలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ మినహా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్ కింద బిజెపి ఏర్పాటు చేసింది. ఒక్కో క్లస్టర్ కు ఒక్కో నాయకుడిని ఇన్ చార్జిగా నియమించింది. అభ్యర్ధుల ఎంపిక, నామినేషన్, ప్రచారం ,ఎన్నిక నిర్వహణ సహా బాధ్యత అంతా క్లస్టర్ ఇన్ చార్జిదే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు క్లస్టర్ ఇన్ చార్జిలు అసలు పనిని మొదలు పెట్టలేదని తెలుస్తోంది. మరోవైపు క్లస్టర్ ఇన్ చార్జిలకు స్థానిక నాయకత్వం మధ్య సమన్వయం లేదనేది జిల్లాల నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న సమాచారం. మరోవైపు మజ్లిస్ తోనే తమకు ప్రధాన పోటీ అని స్వయంగా కిషన్ రెడ్డి ప్రకటించారు, అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఇదే అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నే తమ ప్రధాన ప్రత్యర్థి అని కేటీఆర్ చెప్పారు. ఈ తరుణంలో ప్రత్యర్థి మజ్లీస్ అని కమలనాథులు చెప్పడం బీజేపీ కేడర్ ను అయోమయానికి గురి చేసింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెబుతూనే మజ్లిస్ ను తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదనేది బీజేపీ కార్యకర్తల అనుమానంగా ఉంది. మరోవైపు సీఏఏను ఈ ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలన్నది బిజెపి ఆలోచనగా ఉందని అందుకే కిషన్ రెడ్డి మజ్లిస్ ను తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో సీఏఏ అంశం తమకు ఉపయోగపడుతుందని బిజెపి నేతలు లెక్కలేసుకుంటున్నారు.