ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల పై ఎన్జీటీ కమిటీ 

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, అంతర్వేది ప్రాంతాలలో సముద్ర ఇసుక అక్రమ తవ్వకాల పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లో ఈ రోజు విచారణ జరిగింది. ఈ వ్యవహారం పై అదే జిల్లాకు చెందిన వెంకటపతిరాజు ఎన్జీటీ లో పిటిషన్ వేస్తూ ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు రొయ్యల చెరువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. దీని పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ అక్రమాల పై విచారణ జరపడానికి ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయం పై కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర గనుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీ కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఆదేశించింది. ఈ కమిటీ మూడు నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.