అభివృద్ధికి అడ్డుకట్ట.... శాసనమండలి ఉండటం దండగ అంటున్న జగన్


 

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని సీఎం జగన్ ఆ తరవాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభకు హాజరు కాకూడదని టిడిపి సభ్యులు నిర్ణయించుకోవడంతో సీఎంతో సహా అందరు అధికార పక్ష సభ్యులే దీనిపై మాట్లాడారు. సభ్యులందరూ మండలి రద్దుకు సానుకూలంగా మాట్లాడారు. అభివృద్దిని ఆ సభ అడ్డుకుంటోందని ఖర్చు దండక తప్పా ప్రజా ప్రయోజనాలు లేవని ఆక్షేపించారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండల ఉందని మిగతా రాష్ట్రాలు వద్దనుకున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసమే శాసన మండలి రద్దుకు తీర్మానం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పారు. మండలికి ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని దీనిపై డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగని తేల్చి చెప్పారు. క్యాబినెట్ అనేది కేవలం శాసన సభకే జవాబుదారీగా ఉంటుంది కానీ శాసన మండలికి కాదని స్పష్టం చేశారు. బిల్లులకు అడ్డు తగులుతూ దిక్కుమాలిన ఆలోచనలు చేసే మండలి అవసరం లేదని దానిని రద్దు చేస్తున్నానని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం చెప్పారు.

శాసన మండలి రద్దుకు తీర్మానం చేసిన సీఎం జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి ప్రజల ముందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. రాజధాని బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ అహం దెబ్బతిందని ఆరోపించారు. గతంలో మండలి పునరుద్ధరణ సమయంలో దానిని తమ పార్టీ వ్యతిరేకించిన మాట వాస్తవమని అపుడు అది తమ పార్టీ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. చర్చ ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. రద్దు తీర్మానానికి అనుకూలంగా సభలో ఉన్నవారంతా లేచి నిలబడ్డారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ 132 మంది వైసీపీ సభ్యులు నిల్చున్నారు. దీంతో తీర్మానాన్ని ఆమోదించిన వారి సంఖ్య 133 గా స్పీకర్ ప్రకటించారు. ఓటింగ్ సమయంలో కొంత గందరగోళం నెలకొంది.

మండలి సభ్యులైన మంత్రి మోపిదేవి వెంకట రమణరావు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బయటకు వెళ్లాలని తలుపులు మూసేయాలని స్పీకర్ ఆదేశించారు. తర్వాత అసెంబ్లీ సిబ్బంది సభ్యుల సంఖ్యను లెక్కించారు. దాని ప్రకారం అనుకూలంగా 121 మంది ఉన్నారని స్పీకర్ తొలుత ప్రకటించారు. ఈ లేక్క పై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారని మరోసారి లెక్కించాలని కోరారు. దీంతో అసెంబ్లీ సిబ్బంది మళ్లీ లెక్కించారు, ఈలోగా బయటి నుంచి ఎమ్మెల్యేలు సంతకాలు చేసే హాజరు పట్టికను తీసుకు రావాలని స్పీకర్ పురమాయించారు. రెండోవ సారి లెక్కింపు పూర్తయ్యాక సభలో 133 మంది మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. తీర్మానాన్ని సభ ఆమోదించిందని తెలిపారు. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.